NTV Telugu Site icon

అస‌లు ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాల ప్రాధాన్య‌త ఏంటి..?

VH

అస‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ ప్ర‌భుత్వాల ప్రాధాన్య‌త ఏంటి? అంటూ రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి. హ‌నుమంత‌రావు… ప్ర‌స్తుతం తెలంగాణ‌లో మాజీ మంత్రి ఈట‌ల వ్య‌వ‌హారం హాట్ టాపిక్ కాగా.. ఏపీలో ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మారింది.. అయితే, కోవిడ్ స‌మ‌యంలో.. ఈ ప‌రిస్థితి ఏంటి? అంటూ రెండు ప్ర‌భుత్వాల‌ను నిల‌దీశారు వీహెచ్. హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. ఏపీలో రఘురామకృష్ణంరాజు, తెలంగాణ‌లో ఈటల రాజేంద‌ర్ మీద పెడుతున్న శ్రద్ధ.. కరోనా మ‌హ‌మ్మారి కట్టడిపై ఎందుకు లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. వాళ్ల మీద విచారణకు ఇది సమయం కాద‌న్న ఆయ‌న‌.. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ల పై విచారణ జరపొచ్చు.. కానీ, పోయే ప్రాణాలు రేపటి వరకు ఆగవు క‌దా? అని ప్ర‌శ్నించారు. ఇప్పుడు కరోనా మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అని సూచించిన వీహెచ్.. ప్రజల ప్రాణాలు కాపాడాలి.. కోవిడ్ బాధితులు స్మశానంలో ఉంటున్నారని వచ్చిన ఓ వార్త హృదయ విదార‌క‌రంగా ఉన్నాయ‌న్నారు.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో.. గ్రామాల్లో, మండలాల్లో ఫంక్షన్ హాళ్లను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చే ఆలోచన చేయాల‌ని సూచించారు వీహెచ్‌.