కరోనాను ఆరోగ్య శ్రీలో చేరుస్తామన్న సీఎం కేసీఆర్.. రాత్రికిరాత్రే.. ఆయుష్మాన్ భారత్ లో చేర్చడానికి కారణాలేంటి..? అని ప్రశ్నించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆయుష్మాన్ భారత్ లో చేర్చడం.. మంచిదే.. కానీ, ఆలస్యం ఎందుకైంది..? అని ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 26 లక్షల మంది లబ్దిపొందుతారు. అదే ఆరోగ్యశ్రీ అయితే 77 లక్షల మంది లబ్దిపొందే అవకాశం ఉందని వారే చెప్పారని గుర్తుచేసిన ఆయన.. మరి ఇప్పుడు మిగతా 51 లక్షల మందికి, హెల్త్ కార్డులు వున్నవారికీ ఎలా న్యాయం చెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల్లో వాగ్దానంలో ప్రతి జిల్లాలో నిమ్స్ స్థాయి హాస్పిటల్ ఏర్పాటు చేస్తామన్నారు ఏమైంది..? అని ప్రశ్నించిన శ్రవణ్.. సెకండ్ వేవ్, బ్లాక్ ఫంగస్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. మానవ సేవే మాధవ సేవ అని గుర్తించి ఆస్పత్రులు ఏర్పాటు చేయాలన్నారు.
తమిళనాడులో సీఎం స్టాలిన్ ప్రతిపక్షాలతో టాస్క్ ఫోర్స్ కమిటీ వేశారు.. కానీ, మీరు మంత్రి కేటీఆర్ కు అప్పగించడం ఏంటి? అని ప్రశ్నించారు శ్రవణ్.. కోవిడ్ డ్రగ్స్ పక్కదారి పట్టిస్తే, బ్లాక్ చేస్తే అది నేరమని తెలీదా అని ఫైర్ అయ్యారు. మాస్కులు పెట్టుకోనివారిపై రూ. 31 కోట్ల ఫైన్‌లు వేశామని డీజీపీ తెలిపారు.. ఇది మరి దారుణం.. సర్కార్ ఉచితంగా పంపిణి చేయాల్సింది పోయి.. ఫైన్ ల రూపంలో పిండేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సినిమా థియేటర్స్ కూడా ఐసోలేషన్ సెంటర్లుగా మార్చాలన్న ఆయన.. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలను ఆదుకోవాలన్నారు.. జర్నలిస్ట్ లను కూడా ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలని కోరారు..