NTV Telugu Site icon

Pilot Rohit Reddy : మా ఎమ్మెల్యే కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు.. కిడ్నాప్‌ చేశారా? నిర్బంధించారా?

Pilot Rohit Reddy

Pilot Rohit Reddy

వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేరు తెలంగాణ రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చగా మారింది.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆయన ఫామ్‌హౌస్‌లోనే జరగడంతో.. అందరి దృష్టి ఆయనపైనే పడింది.. ప్రభుత్వం ఆయనకు భద్రతను కూడా పెంచింది.. అయితే, ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి కనిపించడం లేదంటూ తాండూరు టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందిందింది.. గత 20 రోజుల నుంచి మా ఎమ్మెల్యే కనిపించడంలేదు.. మిస్సింగ్ అయ్యారా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదా ఇంకా ఎవరైనా నిర్బంధించారా? అనే విషయాన్ని వెంటనే తేల్చాలంటూ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి.. గత 20 రోజుల నుంచి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే లేరు.. ప్రజలు పలు రకాల సమస్యలతో నియోజకవర్గంలో సతమతమవుతున్నారని వాపోయారు.. ఎమ్మెల్యేను ఎవరైనా బంధించారా లేదా కిడ్నాప్ చేశారా నిర్బంధించారా అనే విషయం స్పష్టం చేయాలంటూ తాండూర్ పోలీసులకు కోరారు రామ్మోహన్ రెడ్డి.

Read Also: Mahesh Babu: బాధ నుంచి బయట పడడానికి ఎన్టీఆర్ బాటలో మహేశ్..

కాగా, నలుగురు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం తెలంగాణలో సంచలనం సృష్టించింది.. ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజులను డబ్బు ఆశ చూపి ప్రలోభపెట్టి , పార్టీ ఫిరాయింపు చేయాలని ప్రయత్నం జరిగినట్టు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజీ స్వామీజీలు ఎమ్మెల్యేలను ఫిరాయింపుకు ప్రోత్సహించినట్లు, వారితో మాట్లాడిన ఆడియోలు, వీడియోలు కలకలం రేపాయి. ఆ తర్వాత వారిపై కేసు నమోదు కావడం, కోర్టులలో కేసులు సంచలన విచారణ, ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం, ప్రస్తుతం ఈ కేసులో సిట్‌ దూకుడు పెంచడం ఆసక్తికరంగా మారిన విషయం విదితమే. మరోవైపు, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆ మధ్య షాకింగ్ కామెంట్లు చేశారు.. తన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తాను ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రిస్కు తీసుకున్నానని, లేదంటే 100 కోట్లు తీసుకుని నేను హ్యాపీగా ఉంటాను కదా అంటూ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో క్లిప్‌ ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం విదితమే.