అదీ ఇదీ అని కాదు.. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు అడ్డూ, అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. పెట్రో ధరల సెగ వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ప్రజలపై మరింత భారం మోపుతున్నాయి. మధ్యతరగతి కొనుగోలు శక్తి నానాటికీ దిగజారి పోతుంది. నలుగురు కుటుంబ సభ్యుల సగటు ఖర్చు ఎనిమిదేండ్లలో రెండింతలు దాటింది. వంట నూనెల దగ్గర్నుంచి సబ్బుల వరకూ మనం రోజువారీ ఉపయోగించే సరుకు ఏదైనా సరే వాటి ధర కొండెక్కి కూర్చున్నది.
ఇవి వేగంగా పెరగడమేకాదు, మునుపెన్నడూ చూడని స్థాయికి చేరిపోతున్నాయి. భరించలేని స్థాయికి చేరడంతో ఇతర ఖర్చుల్లో కోత పెట్టుకోవడంతోపాటు.. పొదుపునూ తగ్గించాల్సి వస్తున్నది. గడిచిన పదేండ్లలో కిరాణా సరుకుల వారాంతం వ్యయం 68 శాతం పెరిగింది. ముగ్గురు సభ్యుల కుటుంబానికయ్యే నెలవారీ కిరాణ ఖర్చు 2012తో పోల్చుకుంటే ఇప్పుడు రెట్టింపైందని డబ్ల్యూపీఐ విశ్లేషించింది. ఆహార పదార్థాల ధరలు 7.68 శాతం అధికమయ్యాయి. నవంబర్ 2020 తర్వాత ఇదే అత్యధికం కావడం విశేషం. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగిన మాట వాస్తవమే.
అయితే ఈ ధరల పెరుగుదలలు.. యుద్ధం కారణంగా ఆకస్మికంగా జరిగినవి కాదని, ధరల పెరుగుదల సూచిక స్పష్టం చేస్తోంది. నిజానికి యుద్ధానికి ముందు నుంచే దేశంలో ద్రవ్యోల్బణం ఛాయలు కనిపిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కంటే ముందే దేశంలో ద్రవ్యోల్బణం 6 శాతంపైగా ఉండటం గమనార్హం. ఓవైపు ధరలు ఆకాశాన్నంటుతున్నా.. సామాన్యుడి ఆదాయంలో మాత్రం మార్పు రాలేదు. పైపెచ్చు కరోనా కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. చిన్నాచితకా వ్యాపారాలు మూతబడ్డాయి. తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాలలో కరెంటు కోతల కారణంగా కంపెనీల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది.
గడిచిన పదేండ్లలో పెట్రో ధరలు రెట్టింపు కావడంతోపాటు ఆహార పదార్థాల ఖర్చు కూడా పరుగులు తీసింది. దీంతో సగటు మనిషి బతుకు దుర్భరమైపోయింది. ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు ఆత్మహత్యల భారత్‌గా మారే అవకాశాలు ఏర్పడినట్టు మెజారిటీ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు మరి. ద్రవ్యోల్బణం అంటే వస్తువులు, సేవల ధరల పెరుగుదల రేటు. భారతదేశంలో ఇది సంవత్సరానికి కొలుస్తారు. అంటే, ఒక నెల ధరలను మునుపటి సంవత్సరం అదే నెల ధరలతో పోల్చుతారు. ఈ రేటు నుంచి మనం ఆ సమయంలో ఒక ప్రదేశంలో జీవనవ్యయం పెరుగుదలను అంచనా వేయవచ్చు.
ఈ సూచిక యొక్క ఉద్దేశ్యం మార్కెట్‌లో ఉత్పత్తుల కదలికను ట్రాక్ చేయడం, తద్వారా డిమాండ్ మరియు సరఫరా పరిస్థితులను తెలుసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి డబ్ల్యూపీఐని తమ ప్రాతిపదికగా పరిగణిస్తాయి. అయితే, భారతదేశంలో ఇది లేదు. మన దేశంలో డబ్ల్యూపీఐతో పాటు వినియోగదారుల ధరల సూచిక(సీపీఐ)ని కూడా ద్రవ్యోల్బణానికి కొలమానంగా పరిగణిస్తారు.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రధాన పరిమితిగా పరిగణిస్తుంది. డబ్ల్యూపీఐ, సీపీఐ ఒకదానిపై ఒకటి ప్రభావం చూపుతాయి. ఈ విధంగా డబ్ల్యూపీఐతోపాటు సీపీఐ కూడా పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలు ప్రజలపై వాటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఆర్థిక విధానాలను రూపొందించాల్సిన కేంద్ర ప్రభుత్వం గుడ్డెద్దు చేతిలో పడిన చందంగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తుండడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదలను, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని బూచిగా చూపుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయినప్పటికీ ధరల పోటును ప్రత్యక్షంగా అనుభవిస్తున్న సామాన్యుడి ఆగ్రహం నుంచి మాత్రం తప్పించుకోలేదని పరిస్థితులు స్పష్టంచేస్తున్నాయి.
