Site icon NTV Telugu

CM Revanth Reddy: బ‌న‌క‌చ‌ర్లను అడ్డుకోండి.. కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రికి సీఎం రేవంత్, ఉత్తమ్ కుమార్ వినతి..

Rr

Rr

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రయోజ‌నాల‌కు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి-బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలిటీ రిపోర్ట్‌ను తిరస్కరించాలని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు విష‌యంలో గోదావ‌రి జ‌ల వివాదాల ట్రైబ్యున‌ల్-1980 (జీడ‌బ్ల్యూడీటీ), ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం-2014ల‌కు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు. ఇక, బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు అనుమ‌తుల విష‌యంలో కేంద్ర ఆర్థిక శాఖ‌, ప‌ర్యావ‌ర‌ణ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళ‌న‌లు నెల‌కొన్నాయ‌ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. గోదావ‌రి వ‌ర‌ద జ‌లాల ఆధారంగా బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెబుతోంద‌ని.. జీడ‌బ్ల్యూడీటీ-1980లో వ‌ర‌ద జ‌లాలు, మిగులు జ‌లాల ప్రస్తావనే లేద‌న్నారు. 2014 ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా నూతన ప్రాజెక్ట్ నిర్మించాల‌నుకుంటే ముందు ఆ న‌దీ యాజ‌మాన్య బోర్డు, కేంద్ర జ‌ల‌ సంఘం (సీడ‌బ్ల్యూసీ), జ‌ల్‌శ‌క్తి మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు స‌భ్యులుగా ఉండే ఎపెక్స్ కౌన్సిల్‌లో చ‌ర్చించి అనుమ‌తి పొందాల‌ని.. బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో ఏపీ వీట‌న్నింటిని ఉల్లంఘిస్తోంద‌ని కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు.

Read Also: Rahul Gandhi: పుట్టిన రోజున రాహుల్ గాంధీ సంతోషంగా లేరు.. కేక్ కట్‌ చేయలేదు.. కారణం ఏంటంటే..?

అయితే, బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో ఏ నిబంధ‌న‌లు పాటించ‌ని ఆంధ్రప్రదేశ్ వ‌ర‌ద జ‌లాల ఆధారంగా ప్రాజెక్టు చేప‌డుతున్నామ‌ని చెబుతుండ‌డం తీవ్ర అభ్యంత‌ర‌క‌ర‌మ‌ని జ‌ల్ శ‌క్తి మంత్రితో సీఎం రేవంత్ తెలిపారు. ఈ విష‌యంలో కేంద్రం, జ‌ల్‌శ‌క్తి మంత్రిత్వ శాఖ తక్షణమే జోక్యం చేసుకొని ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్లకుండా చూడాల‌ని కోరారు. అలాగే, సీడ‌బ్ల్యూసీ ప‌రిధిలోని సాంకేతిక స‌ల‌హా మండ‌లి నుంచి అనుమ‌తులు పొంద‌కుండానే వ‌ర‌ద జ‌లాల పేరుతో పోల‌వ‌రం కింద పురుషోత్తపట్నం, వెంక‌ట‌న‌గ‌రం, ప‌ట్టిసీమ‌, చింత‌లపూడి ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌ను ఏపీ సర్కార్ చేప‌ట్టింద‌ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కు రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. జీడ‌బ్ల్యూడీటీ-1980 నిబంధ‌న‌ల ప్రకారం పోల‌వ‌రం డిజైన్లు మార్పు చేసింది, ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తుల‌కు విరుద్ధంగా ప‌నులు చేప‌డుతోంద‌ి.. తాము అభ్యంత‌రాలు లేవ‌నెత్తినా ప‌నులు మాత్రం కొన‌సాగిస్తూనే ఉంద‌ ఆరోపించారు. జాతీయ‌ప్రాజెక్టు అయిన పోల‌వ‌రం విష‌యంలో ఎటువంటి నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌కుండా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాల‌న్నారు. ఇక, గోదావ‌రిలో వ‌ర‌ద‌ జ‌లాలున్నాయ‌ని నిజంగా ఏపీ భావిస్తుంటే పోల‌వ‌రం- బనకచర్లకు బ‌దులు కేంద్రం నిధులు ఇచ్చే ఇచ్చంప‌ల్లి-నాగార్జున సాగ‌ర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్‌కు నీళ్లు తీసుకెళ్లే విష‌యంలో చర్చకు తాము సిద్ధమని తెలిపారు. కృష్ణా జ‌ల వివాదాల ట్రైబ్యున‌ల్‌-2 తీర్పు త్వరగా వచ్చేలా చూడాల‌ని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు.

Exit mobile version