హైదరాబాద్ నగరం లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ (ICRTF) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతదేశంతో పాటు ఆగ్నేయాసియా దేశాల నుండి తరలివచ్చిన 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. వైద్య వృత్తిలోని గొప్పతనాన్ని, సమాజం పట్ల వారికి ఉండాల్సిన బాధ్యతను వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “నేను డాక్టరును కాకపోవచ్చు, కానీ సమాజం నాడి తెలిసిన సోషల్ డాక్టరును” అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే విజయవంతమైన కార్డియాలజిస్టులుగా ఉన్నప్పటికీ, తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఈ సదస్సుకు రావడం అభినందనీయమన్నారు. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యమని, కొత్త విషయాలను తెలుసుకోవడం ఆపివేస్తే కెరీర్‌కు ముగింపు పలికినట్లేనని ఆయన హెచ్చరించారు. వైద్యులు కేవలం వృత్తి నిపుణులే కాదని, ప్రాణాలు కాపాడే దేవుళ్లుగా ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అత్యాధునిక సాంకేతికతలను వైద్య రంగంలో అందిపుచ్చుకోవాలని సీఎం సూచించారు. టెక్నాలజీలో అప్‌గ్రేడ్ అవుతూనే, ప్రజల నాడిని పట్టుకోవడం మర్చిపోవద్దని హితవు పలికారు. ఇటీవల కాలంలో గుండె జబ్బుల వల్ల మరణాల సంఖ్య పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, దీని నివారణకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులకు సిపిఆర్ (CPR) వంటి ప్రాథమిక చికిత్స పద్ధతులపై అవగాహన కల్పించేందుకు వైద్యులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన కోరారు.
ప్రజల ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆరోగ్య విధానాలను మరింత మెరుగుపరిచేందుకు వైద్య నిపుణుల సలహాలు, సూచనలు ఎల్లప్పుడూ స్వీకరిస్తామని తెలిపారు. క్వాలిటీ హెల్త్ కేర్ అందించడంలో తెలంగాణ ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. హైదరాబాద్ వేదికగా ఇలాంటి అంతర్జాతీయ స్థాయి సదస్సులు జరగడం గర్వకారణమని పేర్కొంటూ, ఇక్కడికి వచ్చిన యువ వైద్యులందరూ ఉత్తమ వైద్యులుగా ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
Bhartha Mahashayulaku Vinnapthi: మాస్ మహారాజా రవితేజ బంగారం: హీరోయిన్ డింపుల్ హయతి
