CM Revanth Reddy : దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కలుగులో నుంచి బయటకు వచ్చిన కేసీఆర్, తన పాత పద్ధతిని మార్చుకోకుండా మళ్ళీ అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. శనివారం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఘాటుగా స్పందించారు. ఓటమితోనైనా కేసీఆర్ మారుతారని ఆశించానని, కానీ ఆయన తీరు మారలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని సీఎం ఆరోపించారు. “కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 64 శాతం, తెలంగాణకు కేవలం 36 శాతం వాటా చాలని సంతకం పెట్టిన ద్రోహి కేసీఆర్. అప్పట్లో ఆయనే స్వయంగా ఒప్పుకుని, ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మాట్లాడటం హాస్యాస్పదం” అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా బేసిన్ దెబ్బతినడానికి, రైతులు నష్టపోవడానికి కేసీఆర్ అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, కృష్ణా జలాలపై పూర్తి వివరాలతో సమాధానం చెబుతానని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో చెక్‌డ్యామ్‌లపై బాంబులు పెడుతున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి కొట్టిపారేశారు. అలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగితే వెంటనే సమాచారం ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక యూరియా పంపిణీ విషయంలో టెక్నాలజీని వాడుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. పంపిణీ పారదర్శకంగా ఉండటం కోసం యాప్ పెడితే రైతులకు వచ్చే నష్టమేమిటని ఆయన నిలదీశారు.
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్‌రావులపై కూడా రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. “కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు, హరీష్‌రావుకు కడుపునిండా విషం నిండిపోయింది. వీరిద్దరికీ కేసీఆరే పెద్ద గురువు” అని విమర్శించారు. తన సొంత చెల్లెలు కవితను కేసీఆర్ కుటుంబమే రాజకీయంగా బయటకు పంపేసిందని, ఆమెకు కనీసం చీర, సారె కూడా పెట్టలేదని సీఎం వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా ఆయన కొడుకు, అల్లుడే చేస్తున్నారని, ఆ నిందను తనపై వేయవద్దని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలోనే తెలంగాణలో అసలైన జలదోపిడీ జరిగిందని, ఇప్పుడు నీతులు చెప్పడం సరికాదని సీఎం హితవు పలికారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, త్వరలోనే బీఆర్ఎస్ నేతలకు బుద్ధి చెబుతారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
ట్రెడిషనల్ చీరలో మోడర్న్ గ్లామర్.. అనసూయ స్టన్నింగ్ లుక్స్ వైరల్!
