CM Revanth Reddy : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (S.I.R) ప్రక్రియపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) నిర్వహించిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓట్లలో మెజారిటీ శాతం ఓట్లను ఏదో ఒక కారణంతో పక్కన పెట్టారని, ‘అనుమానాస్పదం’ అనే నెపంతో వాటిని తొలగించే పెద్ద ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ 2026 అక్టోబరులోనే ఓటర్ల జాబితా దాదాపు ఫైనల్ అవుతుందని గుర్తుచేసిన సీఎం.. ఒకసారి ఓట్లు తొలగిపోతే భవిష్యత్తులో మనం చేసేదేమీ ఉండదని, ఇది రాజకీయంగా అత్యంత ప్రమాదకరమైన సందర్భమని పార్టీ నాయకులను హెచ్చరించారు.
వలస ఓటర్లపై ప్రత్యేక నిఘా.. బూత్ స్థాయి అనుసంధానం
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో, ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ప్రభుత్వ బూత్ లెవెల్ అధికారులతో (BLO) కాంగ్రెస్ ముఖ్య నాయకులు నిరంతరం అనుసంధానమై ఉండాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉపాధి లేదా ఇతర కారణాల వల్ల వలసలు వెళ్లిన ఓటర్లు, బీఎల్ఓలు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు ఇళ్లలో అందుబాటులో ఉండకపోవచ్చని, ఆ కారణంతో వారి ఓట్లను తొలగించకుండా అత్యంత జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ ప్రక్రియను ఎవరూ ఆషామాషీగా తీసుకోవద్దని, ప్రతి ఒక్కరూ అత్యంత సీరియస్‌గా రంగంలోకి దిగి అర్హులైన వారి ఓటు హక్కును కాపాడాలని పిలుపునిచ్చారు.
జిల్లాల వారీగా మానిటరింగ్.. గాంధీ భవన్‌లో వార్ రూమ్
ఓట్ల పరిరక్షణ కోసం జిల్లా ఇంచార్జి మంత్రులు ఈ నెల 20వ తేదీ లోపు సంబంధిత పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా ప్రత్యేక మానిటరింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ సమస్యలను పర్యవేక్షించాలన్నారు. ఎక్కడ తప్పులు జరిగినా అసెంబ్లీ స్థానాల్లో అసెంబ్లీ ఇంచార్జ్‌లు, పార్లమెంట్ పరిధిలో పార్లమెంట్ ఇంచార్జ్‌లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీనితో పాటు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌లో ప్రత్యేక ‘వార్ రూమ్’ ఏర్పాటు చేసి, బూత్ స్థాయి సమాచారాన్ని ఏ రోజుకారోజు నివేదికల రూపంలో తెప్పించుకుంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

