CM Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సంచలనం సృష్టిస్తున్న ఈ ఫార్మాలా కేసు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేయాలన్నా, ఆయనపై చార్జిషీట్ దాఖలు చేయాలన్నా.. గవర్నర్ అనుమతి తప్పనిసరి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ విచారణకు ఇప్పటికే గవర్నర్ అనుమతి ఇచ్చినా.. చార్జిషీట్‌కు మాత్రం ఇంకా ఆమోదం లభించలేదన్నారు.
2018లో ‘ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్’ కు చేసిన సవరణల గురించి ప్రస్తావించిన ముఖ్యమంత్రి.. ఏ మంత్రి మీద విచారణ చేయాలన్నా, ఆ తర్వాత చార్జిషీట్ వేయాలన్నా.. గవర్నర్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఈ నిబంధనల ప్రకారమే, రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ పట్ల విచారణ చేయడానికి గవర్నర్ ఆమోదం కోరగా… గవర్నర్ అనుమతి ఇచ్చారన్నారు. విచారణలో నిర్దిష్టమైన ఆధారాలు లభించాయని, దాని ఆధారంగా చార్జిషీట్ ఫైల్ చేయడానికి గవర్నర్ ఆమోదం కోసం పంపించామని రేవంత్ రెడ్డి తెలిపారు.
కానీ, ఇక్కడే అసలు సమస్య మొదలైంది..! దాదాపుగా మూడు నెలలు కావస్తున్నా, గవర్నర్ నుంచి ఈ చార్జిషీట్‌కు సంబంధించిన ఆమోదం లభించలేదు. ఒకవేళ గవర్నర్ అనుమతి లేకుండా కేటీఆర్‌ను అరెస్ట్ చేసినా, కేసు కట్టినా… కేవలం 10 నిమిషాల్లోనే ఆయనకు బెయిల్ దొరకడానికీ, కేసు నుంచి తప్పించుకోవడానికి దారి దొరుకుతుందనీ ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అంటే, చట్టపరమైన ప్రక్రియ సక్రమంగా జరగాలంటే, గవర్నర్ అనుమతి కీలకం అని ఆయన చెప్పారు.
ఇదే సందర్భంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీపై సూటిగా సవాల్ విసిరారు. అవినీతి విషయంలో ఏ మాత్రం రాజీ పడని బీజేపీ… కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ‘నేషనల్ హెరాల్డ్’ పత్రిక విషయంలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని రోజుల కొద్దీ ఈడీ ఆఫీస్‌కు పిలిపించి విచారించింది. మరి… కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులను మాత్రం బీజేపీ ఎందుకు వదులుతోందని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా సైతం కాళేశ్వరం ఒక ‘ఏటీఎం’ గా మారిందని, వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని బహిరంగంగా ప్రకటించారన్నారు.
అలాంటప్పుడు, తాము విచారణ చేయించి, దోషులను శిక్షించమని సీబీఐకి రాసినా… ఆ పని చేయకుండా నెలల కొద్దీ తాత్సారం చేయడం ఎందుకు అని ముఖ్యమంత్రి సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యవహారం ముందుకు కదలకపోవడానికి కారణం… ‘ఫెవికాల్ బంధం’ ఎవరిద్దరి మధ్య ఉందో చెప్పాలని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో బీజేపీని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, హోం శాఖ మంత్రి కింద సీబీఐ వస్తుంది కాబట్టి, కేంద్ర నాయకత్వం దీనికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
