Site icon NTV Telugu

CM Revanth Reddy : ధీరత్వమే దైవత్వంగా మారిన చరిత్ర మేడారం మహోత్సవం

Cm Revanth Reddy

Cm Revanth Reddy

దక్షిణ భారత కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర వేళ తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్. రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయాలతో గిరిజన గడ్డపై అడుగుపెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల, అది కూడా మేడారం వంటి పుణ్యక్షేత్రంలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి ముఖ్యమంత్రి సరికొత్త చరిత్రకు నాంది పలికారు. మేడారం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గిరిజన తల్లుల గొప్పతనాన్ని కొనియాడారు. “ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం మేడారం మహోత్సవం. కాకతీయుల కత్తికి ఎదురు నిలిచిన ధీరవనితలు సమ్మక్క-సారలమ్మలు. గుడి లేని ఆ తల్లులను గుండె నిండా కొలుచుకునే తెలంగాణ ప్రజల అతిపెద్ద గిరిజన సంస్కృతికి ఈ జాతర నిదర్శనం” అని ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు.

తన రాజకీయ ప్రస్థానంలో మేడారం పాత్రను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 6న అప్పటి ప్రజా కంటక పాలనను గద్దె దించాలని ఇదే మేడారం గడ్డపై మొక్కుకుని తాను పాదయాత్ర ప్రారంభించానని తెలిపారు. “ఆనాడు తల్లుల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేడు ఆ మొక్కును తీర్చుకునే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మేడారం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం వంద రోజుల వ్యవధిలోనే రాతి కట్టడాలతో తల్లుల ప్రాంగణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని తాను అధికారులను ఆదేశించానని, జాతర నాటికి ఆ పనులన్నీ పూర్తి కావడం గర్వకారణమని చెప్పారు. భవిష్యత్తులో తన జీవితంలో ఏం చేశామని వెనక్కి తిరిగి చూసుకుంటే, గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేశానని గర్వంగా చెప్పుకుంటానని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

భక్తుల సౌకర్యార్థం జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. రామప్ప, లక్నవరం చెరువుల నుండి జంపన్న వాగుకు నీటిని తరలించేలా శాశ్వత ప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రేపు ఉదయం సమ్మక్క-సారక్క నూతన ఆలయాన్ని ప్రారంభించి భక్తులకు అంకితం చేస్తామని సీఎం ప్రకటించారు. మేడారం జాతరను దేశవ్యాప్తంగా గుర్తించేలా, కుంభమేళా స్థాయిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, గిరిజన సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

IND vs NZ: రోహిత్ శర్మ 2027 ODI వరల్డ్ కప్‌కు దూరమవుతాడా?.. ODI సిరీస్‌లో ఘోరంగా విఫలం

Exit mobile version