మహబూబ్ నగర్ జిల్లా కరివేన వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం (ప్రెస్ మీట్) నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని సాగునీరు, ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపి, పాలమూరు భవిష్యత్తు కోసం ఎలాంటి అడుగులు వేయాలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.
పాలమూరు ప్రజల రుణం తీర్చుకుంటా
2009లో కష్టకాలంలో తనను అక్కున చేర్చుకుని మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించిన పాలమూరు ప్రజలను తాను ఎన్నటికీ మరువలేనని సీఎం గుర్తుచేసుకున్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని చెప్పారు. ఇతర జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అన్ని రంగాల్లో వెనకబడి ఉందని, అనేక సందర్భాల్లో తాను చట్టసభల్లో సైతం ఇదే అంశంపై ప్రశ్నించానని పేర్కొన్నారు. జెడ్పీటీసీ సభ్యుడి స్థాయి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే వరకు జిల్లాలోని నలుమూలలా తిరిగానని, ఇక్కడి సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.
కమిషన్ల కక్కుర్తి.. భూసేకరణలో నిర్లక్ష్యం
గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో రూ. 1,81,000 కోట్లు ఖర్చు పెట్టిందని, అందులో రూ. 27,000 కోట్లు కేవలం పంపు లిఫ్ట్‌లకే కేటాయించి వేల కోట్ల రూపాయల కమిషన్లు తిన్నారని సీఎం ఆరోపించారు. తొంభై టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉన్న ‘పాలమూరు-రంగారెడ్డి’ అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ అని ఆయన అభివర్ణించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులన్నింటినీ కలిపినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టే అన్నింటికంటే పెద్దదన్నారు. ఇవన్నీ సక్రమంగా పూర్తి చేసి ఉంటే జిల్లాలో 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని చెప్పారు.
ఏ ప్రాజెక్ట్ చూసినా కనీసం భూసేకరణ కూడా చేయలేదని, కాల్వలకు, రిజర్వాయర్లకు భూసేకరణ చేయకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ (పునరావాస) ప్యాకేజీ ఇవ్వకుండా నీళ్లు ఎలా ఇవ్వగలమని దుయ్యబట్టారు. జిల్లాలో ఇంకా నాలుగు వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. నాటి పాలకుల తీరును ఎండగడుతూ.. నాడు నాగం జనార్ధన్ రెడ్డి ప్రాజెక్టుల కోసం కొట్లాడితే, చివరికి ఆయనను పక్కనే చేర్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఒకాయన గోచీ కట్టుకుని తిరుగుతూ తనను తాను రాజశేఖర్ రెడ్డిగా ఊహించుకుంటున్నారని, రాజకీయ కార్యచరణ పేరిట కాశీ వరకు నడిచినా తప్పులేదంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
ఆర్థిక సంక్షోభంలోనూ నిధుల విడుదల
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నం అయిందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. యాభై శాతం నిధులు కూడా ఖర్చు పెట్టకుండా, తొంభై శాతం పనులు పూర్తయ్యాయని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. సివిల్ వర్క్స్ , భూసేకరణకు గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని, కానీ ఇప్పుడు తమను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానికంగా ఉన్న ప్రజలకు క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో ఖచ్చితంగా తెలుస్తుందని, తాము ఏం చేస్తున్నామో వారికి అర్థమవుతుందని అన్నారు.
ఈ ఆర్థిక ఇబ్బందుల్లోనూ తాము అధికారంలోకి వచ్చాక ఈ ఒక్క నెలలోనే రూ. 52,121 కోట్లు అప్పులు, మిత్తి (వడ్డీ)ల కింద చెల్లించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టుల పాత బిల్లుల కోసం రూ. 22,000 కోట్లు విడుదల చేశామని, అందులో దాదాపు రూ. 8,000 కోట్లు కేవలం పాలమూరు జిల్లా ప్రాజెక్టులకే ఇచ్చామని స్పష్టం చేశారు. రాబోయే రెండేళ్లలో జిల్లాలోని పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేయాలనే గట్టి లక్ష్యంతో ఉన్నామని, ఇందుకోసం ప్రతి ఆరు నెలలకోసారి పనులపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తూ ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
