Site icon NTV Telugu

CM Revanth Reddy : అమెరికా – తెలంగాణ బంధం మరింత బలపడాలి

Cm Revanth

Cm Revanth

CM Revanth Reddy : హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో జరిగిన అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమెరికా స్వాతంత్ర్యం ప్రపంచ దృష్టికోణాన్ని పూర్తిగా మార్చిందని ప్రశంసించారు.

అమెరికా ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా నిలవడమే కాకుండా, ఆవిష్కరణలకు నాంది పలికిన దేశంగా ఎదిగిందని రేవంత్ పేర్కొన్నారు. ఓటమిని అంగీకరించని ఆత్మవిశ్వాసం అమెరికా స్ఫూర్తికి చిహ్నమని, అదే తరహాలో తెలంగాణ కూడా స్నేహబద్ధమైన బంధాలను కోరుకునే, వాటిని మరింత బలపరిచే రాష్ట్రంగా ఎదుగుతోందని అన్నారు.

2008లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అమెరికా కాన్సులేట్ కార్యాలయం హైదరాబాద్‌లో స్థాపించబడిందని గుర్తు చేసిన సీఎం, అప్పటి నుంచీ అమెరికా – భారత్ సంబంధాలు దౌత్య పరంగా బలపడుతున్నాయన్నారు. తెలుగుభాషకు అమెరికాలో విశేష ఆదరణ లభిస్తుండటమే ఈ బంధానికి నిదర్శనమని తెలిపారు.

Vishwambhara : ఓజీ ఓకే.. విశ్వంభర ఎప్పుడో..?

ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని కాన్సూల్ జనరల్ శ్రీమతి జెన్నిఫర్ లార్సన్‌ ప్రజల మధ్య, వాణిజ్య సంబంధాల మధ్య వారధిగా నిలుస్తున్నారన్నారు. ఐటీ, ఫార్మా, డిఫెన్స్, మాన్యుఫాక్చరింగ్, ఏరోస్పేస్ రంగాల్లో దాదాపు 200 అమెరికన్ కంపెనీలు ప్రస్తుతం హైదరాబాద్‌నే కేంద్రంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు.

అమెరికా వెళ్లి చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణను 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ‘తెలంగాణ రైజింగ్’ దార్శనికతతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. దీనికోసం అమెరికా మద్దతు కూడా కోరుతున్నట్లు స్పష్టం చేశారు.

అమెరికా – భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం నమ్మకం, విలువలపై ఆధారపడిందని, ప్రపంచ శాంతిని నెలకొల్పడం, పెట్టుబడుల పెంపు, ప్రజాస్వామ్య విస్తరణ వంటి రంగాల్లో ఈ సంబంధాలు మరింతగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. సైనిక వినియాసాలు, అంతరిక్ష పరిశోధనలు, సాంకేతిక రంగాల్లో సహకారం ఇప్పటికే ఉన్నట్లు పేర్కొన్నారు.

“ఒక్కటిగా ఉంటే.. మరింత పటిష్ఠంగా ఎదగగలము” అనే ఈ వేడుకల థీమ్‌ను ప్రతిబింబిస్తూ, తెలంగాణ – అమెరికా బంధం కూడా అదే దిశగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

AP Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం!

Exit mobile version