NTV Telugu Site icon

CM KCR-TRS: సీబీఐ, ఈడీ, ఐటీ చూస్తున్నాయి జాగ్రత్త. టీఆర్‌ఎస్‌ నేతలను అలర్ట్‌ చేసిన సీఎం కేసీఆర్‌!.

Cm Kcr Trs

Cm Kcr Trs

CM KCR-TRS: కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను ఆయన సమీక్షించినట్లు సమాచారం. శాంతిభద్రతల విషయంలో ఇన్నాళ్లూ వ్యవహరించిన తీరుగానే అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోలీసులను ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆయన ఎర్రవల్లిలోని తన ఫాంహౌజ్‌లో సమావేశం నిర్వహించారని పార్గీ వర్గాలు తెలిపాయి.

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), ఇన్‌కం ట్యాక్స్‌(ఐటీ) విభాగాలు హైదరాబాద్‌లోని పలు సంస్థల్లో ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేపడుతుండటాన్ని కేసీఆర్‌ ఈ భేటీలో ప్రముఖంగా ప్రస్తావించినట్లు వార్తలు వస్తున్నాయి. కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీ విధానాలను, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఎండగడుతున్న సంగతి తెలిసిందే. దీంతో గులాబీ నేతలు ఎక్కడ దొరుకుతారా కేసులు పెడదామా అని మోడీ ప్రభుత్వం కాచుకొని కూర్చుందని కేసీఆర్‌ తన పార్టీ నేతలను అలర్ట్‌ చేసినట్లు టాక్‌.

Investment-Profit: 10 వేల పెట్టుబడి. ఏడాదిలోనే 2.77 లక్షలు. అతి భారీ లాభం

ఇందులో భాగంగానే ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో తన కూతురు ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తుండటాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారని చెబుతున్నారు. అందువల్ల రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీకి చెందిన ప్రతిఒక్కరు, ప్రజాప్రతినిధులు ఇలాంటి అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు, సమావేశాలకు దూరంగా ఉండాలని కేసీఆర్‌ సూచించినట్లు తెలియవస్తోంది. అవినీతి, అవకతవకలు, కుంభకోణాల్లో ఇరుక్కో వద్దని, తద్వారా అనవసర ప్రచారాలకు, చెడ్డ పేరుకు తావు ఇవ్వొద్దంటూ పార్టీ కేడర్‌ని హెచ్చరించారని పొలిటికల్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

పాదయాత్రలో ఉన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్‌ చేయటం, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యల వల్ల తలెత్తిన సంఘటనలను సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా ఉటంకించినట్లు భోగట్టా. 2014 నుంచి(ఎనిమిదేళ్లుగా) తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రశాంత వాతావరణాన్ని కమలం పార్టీ లీడర్లు మతం పేరుతో, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చెడగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

విద్వేషపూరిత ప్రసంగాలతో, హింసాత్మక చర్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అమలుచేసిన పలు ఆదర్శవంతమైన విధానాల వల్ల దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు పెరిగాయని, తద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతున్నాయని ఆయన చెప్పారని సంబంధిత వర్గాలు అన్నాయి. ఈ ప్రగతిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతనూ కేసీఆర్‌ వివరించారని తెలిపాయి.