నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిథిలో, దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లు వేయడానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించి ఇరిగేషన్ అధికారులతో సమన్వయ బాధ్యతలను మంత్రి జగదీష్ రెడ్డి తీసుకోవాలన్నారు. ఇటీవల నెల్లికల్లులో శంఖుస్థాపనతో మంజూరు చేసిన 15 లిఫ్టు ప్రాజెక్టులన్నింటికి , కాల్వల నిర్మాణం, పంపుల ఏర్పాటు తదితరాలన్నీ కలిపి అంచనాలను తయారు చేయాలని సిఎం సూచించారు. ఏలిప్టుకాలిప్టు ప్రకారం అంచనాలను వేరు వేరుగా తయారు చేసి అన్నింటికీ ఒకేసారి టెండర్లు పిలవాలని ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించారు. తెలంగాణ వరప్రదాయనిగా కాళేశ్వరం ప్రాజెక్టు మారిన నేపథ్యంలో వానకాలం సీజన్ ప్రారంభం కాగానే నీటినిఎత్తిపోసి పైనించి చివరి ఆయకట్టు తుంగతుర్తి దాకా వున్న అన్ని చెరువులను, రిజర్వాయర్లను, చెక్ డ్యాములను నింపుకోవాలని సూచించారు.
ఇప్పటికే కాళేశ్వరం నీటితో 90 శాతం చెరువులు, కుంటలు నిండివుండడంతో భుగర్భ జలాలు పెరిగాయని తద్వారా బోర్లల్లో నీరు పుష్కలంగా లభిస్తున్ననేపథ్యంలో రైతులు వరిపంట విస్తృతంగా పండిస్తున్నారని సిఎం చెప్పారు. రోహిణి కార్తె ప్రారంభమయిన నేపథ్యంలో, నారుమడి సిద్ధంచేసుకుంటే వరిపంట చీడపీడల నుంచి రక్షింపబడతుందనీ, అధిక దిగుబడి వస్తుందనే విశ్వాసంతో రైతులు వుంటారనీ, కాబట్టీ వారికి నీరు అందించడానికి ఇరిగేషన్ శాఖ సంసిద్ధం కావాలని సూచించారు. కృష్ణాబేసిన్ లో ప్రభుత్వం ఇటీవల నిర్మించ తలపెట్టిన లిఫ్టులు, గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల పురోగతి , వానాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాలువల మరమ్మతులు, వాటి పరిస్థితి, తదితర సాగు నీటి అంశాల పై మంగళవారం నాడు సీఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వేల కోట్లు ఖర్చు చేసి సాగునీటి ప్రాజెక్టులు కడుతున్నాం. వాటిని వ్యూహాత్మకంగా రైతు సంక్షేమానికి వినియోగించే విధానాలను అవలంబించాలె. ప్రాణహిత లో నీటి లభ్యతను అది ప్రవహించేతీరును అర్థం చేసుకోవాలి. ప్రాణహిత ప్రవాహం జూన్ 20 తర్వాత ఉధృతంగా మారుతుంది. అప్పడు వచ్చిన నీరును వచ్చినట్టే ఎత్తిపోసి కాళేశ్వరం రాడార్లో వున్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లను నింపుకోవాలె. కాల్వల మరమ్మతులు కొద్దిపాటి కొరవలు మిగిలి ఉన్నాయి. వాటిని సత్వరమే పూర్తి చేసుకొని, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చేపట్టాలి. కాళేశ్వరాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. రోహిణి కార్తెలో నాటేసుకుంటే చీడ పీడల బాధ ఉండదని, అధిక దిగుబడి వస్తదని రైతాంగం విశ్వసిస్తారు. ఈలోపు చెరువులు, కుంటలు నింపుకోవాలె. రైతు పండించే పంట రైతుకు మాత్రమే చెందదు. అది రాష్ట్ర సంపదగా మారుతుందనే విషయాన్ని మీరు గ్రహించాలి అన్నారు సీఎం కేసీఆర్.
ఇరిగేషన్ శాఖ కృషితో తెలంగాణ సాగునీటి రంగం, వ్యవసాయ రంగం ముఖచిత్రం మారిపోయింది. ఒక్క కాళేశ్వరం ద్వారానే నేడు 35 లక్షల ఎకరాల్లో రెండు పంటలను పండించే స్థాయికి చేరుకున్నామంటే ఆశామాషీ కాదు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ నేడు పంజాబ్ తర్వాత రెండో పెద్ద రాష్ట్రంగా అవతరించింది. ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు తెలంగాణ వ్యవసాయాన్ని నాటి పాలకులు నిర్లక్ష్యం చేసిన ఫలితంగా రైతులు 50 వేల కోట్ల సొంత ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల బోర్లు వేసుకున్నారు. భార్యల మెడలమీది పుస్తెలమ్మి వ్యవసాయం చేసిన దీన స్థితి నాటి పరిస్థితి. కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నీల్లతో భూగర్భజలాలు పెరగడం వల్ల నాడు తొవ్వుకున్న బోర్లు నేడు పొంగి పొర్లుతున్నాయి. దాంతో ప్రాజెక్టు నీల్లతో సాగవుతున్న ఆయకట్టుకు సమానంగా బోర్ల ద్వారా నేడు తెలంగాణ రైతులు పంటలు పండిస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తుండడంతో సమృద్ధిగా పంటలు పండిస్తూ ప్రాజెక్టు జలాలతో తెలంగాణ బోరుబావులు స్థిరికరించబడినవి. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడు ఒక్క టిఎంసి కూడా దిక్కు లేదు. నేడు గోదావరి మీద కట్టుకున్న ప్రాజెక్టుల్లో గోదావరీ నదీ గర్భంలోనే 100 టిఎంసిల నీటిని నిల్వచేసుకునే స్థాయికి చేరుకున్నాం అని సిఎం వివరించారు.