తెలంగాణ రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో.. ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా.. 64 ఏళ్ల రికార్డ్‌ను బద్దలుకొడుతూ వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు. 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో.. అధికారులు 17 గేట్లు ఎత్తి మూడు లక్షల క్యూసెక్కుల నీరుని బయటకు పంపుతున్నారు. ఔట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో.. ప్రాజెక్ట్ కట్ట పై నుంచి నీరు ప్రవహిస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్.. వెంటనే మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్ చేసి, కడెం ప్రాజెక్టులో వరద పరిస్థితిపై ఆరా తీశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో, మంపు గ్రామాలు, సహాయక చర్యల గురించి సీఎంకు మంత్రి వివరించారు. వరద కొంత తగ్గుముఖం పట్టిందని, ప్రమాద ముప్పు లేనట్టేనని తెలిపారు. అనంతరం వర్షం, వరద తగ్గితే ప్రాజెక్ట్ డ్యాం సేఫ్‌గా ఉంటుందని మంత్రి అన్నారు. 12 గ్రామాలకు చెందిన 3 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ప్రజలు భయాందోళనలో ఉన్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.