CM KCR-NITI Aayog: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నీతి ఆయోగ్‌ను నడుపుతున్న విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. టీమిండియా అంటే ఇదేనా అని నిలదీశారు. నీతి ఆయోగ్ మీటింగ్ ఒక భజన మండలి అని విమర్శించారు. ఈ సమావేశాన్ని గంటల్లో ముగించటం ఏంటి అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ”70 వేల టీఎంసీల నీళ్లు ఉన్న దేశంలో మద్రాస్ నగరం ఒక బకెట్ నీళ్ల కోసం ఇబ్బందిపడటం ఏంటి?. ఫ్లోరైడ్ సమస్యను కేంద్రం పరిష్కరించలేదు.
నీతి ఆయోగ్ నిర్వహించిన ప్రతి సమావేశంలోనూ నేను రాష్ట్ర సమస్యలను నొక్కి చెప్పాను. కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలంగాణలోని అన్ని పథకాలను మెచ్చుకుంటున్నారు. నీతి ఆయోగ్ ప్రశంసలు అందుకోని విభాగమే ఈ రాష్ట్రంలో లేదు. కానీ కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అసలు నీతి ఆయోగ్‌లో, దేశంలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థంకావట్లేదు. సుమారు 1 లక్షా 90 వేల కోట్ల రూపాయలను గత ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేశాం. ఇందులో కనీసం 5 వేల కోట్ల రూపాయలు కూడా కేంద్రం ఇవ్వలేదు. నీతి ఆయోగ్ వల్ల ఒరుగుతున్నదేంటి? ఇదేనా సమాఖ్య స్ఫూర్తి?.
రూపాయి విలువ పాతాళానికి పడిపోయింది. 15వ ఆర్థిక సంఘం 6 వేల కోట్ల రూపాయలు ఇవ్వమంటే ఆరు పైసలు కూడా విడుదల చేయలేదు. నేను నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అక్కడ ఏం మాట్లాడినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే. ఎవరూ పట్టించుకోరు. గోడకు చెప్పినట్లే లెక్క. ద్రవ్యోల్బణం పెరుగుతున్నా చూస్తూ కూర్చుకుంటున్నారు. నిరుద్యోగం పెరిగిపోతోంది. రైతులు ఆక్రందన చేస్తున్నారు. సైనిక నియామకాల విధివిధానాలను మార్చే ముందు ఒక్కరినైనా అడిగారా? నీతి ఆయోగ్‌లో చర్చించారా? ఇలా చేస్తుంటే ఏమనుకోవాలి?.
నీతి ఆయోగ్ మీటింగ్‌లో సీఎంలకు కూడా టైమ్ పీరియడ్ పెట్టి బెల్ కొడుతున్నారు. ఈ సమావేశాలను రెండు మూడు రోజుల పాటు సుదీర్ఘంగా నిర్వహిస్తే తప్పేంటి?. దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపైనా కూలంకషంగా చర్చించుకోవద్దా?. రాజ్యాంగబద్ధ సంస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటున్నారు. ఇవే సంస్థలు రేపు మిమ్మల్నీ టార్గెట్ చేస్తాయని మర్చిపోవద్దు. దేశంలో ఒకే పార్టీ ఉంటుందని ప్రకటిస్తారా?. ఇంత అహంకారమా?. ప్రజలు ఆలోచించాలి.
ప్రజలంటే ఇంత నిర్లక్ష్య వైఖరా?. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కాగానే వాడు అటు, వీడు ఇటు వెళ్లిపోవటమేనా? కొంత మంది రైతుల మీదికి కార్లు ఎక్కించి చంపారు. పన్నులను దేని మీద విధించాలో దేని మీద విధించొద్దో నీతి ఆయోగ్ సమావేశంలో చర్చిస్తారా? పాల మీద పన్ను, ప్రాణం పోతే పన్ను.. ఇదేనా మీ తీరు?. ప్రధాని ఇప్పటికైనా తన బుద్ధి మార్చుకోవాలి. నేను తమాషాగా నీతి ఆయోగ్ భేటీని బహిష్కరించలేదు” అని కేసీఆర్ పేర్కొన్నారు.