టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలు మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ 21వ ఆవిర్భవ వేడుకల్లో భాగంగా పలు కీలక తీర్మాణాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సమావేశాల్లో మాట్లాడుతూ.. ఈ రోజు దేశంలో జరుగుతున్నటువంటి మత విద్వేషాలు మంచిదా అని ఆయన ప్రశ్నించారు. కుటిల రాజకీయం, పచ్చి రాజకీయ లబ్దితోని, పది మంది పదవుల కోసం విధ్వంసం చేయడం తేలికనే.. కానీ.. నిర్మాణం చేయాలంటే చాలా సమయం పడుతుందన్నారు. ఎవరు అవునన్నా.. కాదన్నా.. కర్ణాటక రాష్ట్రంలో సిలికాన్ వ్యాలీ ప్రత్యక్షంగా 30 లక్షల మంది.. పరోక్షంగా మరో 30 లక్షల మందికి ఉద్యోగాలు అందిస్తోందన్నారు.
అలాంటి కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్, హలాల్ అంటూ ఇది కొనవద్దు అది కొనవద్దు అంటూ.. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం.. ఏ పని ఎవరైనా స్వీకరించవచ్చునని, ఏ వృత్తిని ఎవరైనా స్వీకరించవచ్చన్నారు. కానీ ఇదెక్కడి అన్యాయం.. ఇదెక్కడి దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. అయితే.. 13 లక్షల మంది భారతీయులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని.. అక్కడి వారి కూడా ఇదే విధంగా ఆలోచిస్తే మనవారి పరిస్థితి ఏంటో ఓ సారి ఆలోచించాలన్నారు. దేశరాజధానిలో దేవుడిపేరుమీద జరిగే ఊరేగింపులో కత్తులు, తుపాకులు వాడుతారా.. ఇదేనా.. ఈ భారతదేశామేనా మనకు కావాల్సింది.. దీనికోసమేనా మహాత్ముడు కలలుకన్నది. ఇదేనా ప్రజలు కోరుకుంటున్నది అని ఆయన ప్రశ్నించారు.
