తెలంగాణ హైకోర్టులో బార్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిగా హాజరయ్యారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.సమావేశంలో హైకోర్టు చీఫ్ జస్టీస్ సతీష్ చంద్ర శర్మ, హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ సభ్యులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ తెలంగాణ న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు తనకి సన్మానం చేయడం చాలా అనందంగా ఉందన్నారు.
ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే. ఎక్కడ ఉన్నా ఎంతటి పోస్టులో ఉన్న తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యుడినే. హైకోర్టుకి వస్తే తల్లి ఒడిలో ఉన్నట్లు ఉంది. నన్ను ఇంతగా ఆదరిస్తున్న తెలంగాణా ప్రజలకు శతకోటి వందనాలు అన్నారు జస్టిస్ ఎన్వీరమణ. సామాన్యుడికి న్యాయం చేకూరడానికి రెండు విషయాలు చాలా కీలకం అన్నారు. కోర్టులు అందుబాటులో ఉండటం, వాటిలో మౌళిక సదుపాయాలు ఉండాలన్నారు.
ఇందుకు జుడిషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడమే తరువాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1100 మంది హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు. 400 ఖాళీలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మే నెలాఖరు వరకూ మరో 200 మంది జడ్జిల నియామకం పూర్తి అవుతుంది.
తెలంగాణలో 24 ఉంటే 42 చేశాము. ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి, కొలిజియం మెంబర్లు పేర్లు సూచిస్తే వాటిని భర్తీ చేస్తాం అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.

Cji Justice Nv Ramana