NTV Telugu Site icon

Cinema Functions: అభిమానుల ప్రాణాలు తీస్తున్న సినిమా ఫంక్షన్లు

Cinema Functions

Cinema Functions

Cinema Functions: ప్రి-రిలీజ్‌ ఈవెంట్‌.. ఆడియో లాంఛ్‌.. సక్సెస్‌ టూర్‌.. ఫొటో షూట్‌.. ఫొటో సెషన్‌.. పేరేదైనా సినిమా ఫంక్షన్లు అభిమానుల ప్రాణాలు తీస్తున్నాయి. మూవీలకు మార్కెట్‌లో హైప్‌ క్రియేట్‌ చేయటం కోసం అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు ఫ్యాన్స్‌ను బలిగొంటున్నాయి. కొన్నిసార్లు అభిమానులకు తీవ్ర గాయాలతో చావు తప్పి కన్ను లొట్ట బోతోంది. దీనికి తాజా ఉదాహరణ ‘బింబిసార’ మూవీ ప్రీ-రిలీజ్‌ ప్రోగ్రాం. నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన ఈ సినిమా ఈవెంట్‌ మొన్న శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగింది.

ఇందులో పాల్గొన్న పుట్టా సాయిరాం అనే యువకుడు మూర్ఛ (ఫిట్స్‌) రావటంతో చనిపోయాడు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇతణ్ని కొండాపూర్‌లోని శిల్పకళా వేదిక నుంచి సమీప ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ చాలా జరిగాయి. గతేడాది డిసెంబర్‌లో ఫొటోషూట్‌కి స్టైలిష్‌ స్టార్‌ అల్లూ అర్జున్‌ వస్తున్నాడనే ప్రచారంతో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వాళ్లను కంట్రోల్‌ చేయటానికి పోలీసులు లాఠీఛార్జ్‌కి దిగాల్సి వచ్చింది.

Women: ‘ఆమె’కు వందనం. అవయవదాతల్లో 80 శాతం ఆడవాళ్లే. గ్రహీతల్లో 20 శాతమే. ఎందుకిలా?

అదే నెలలో ప్రభాస్‌ చిత్రం రాధేశ్యామ్‌ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో కనీసం ముగ్గురు ఫ్యాన్స్‌ గాయాల బారినపడ్డారు. ప్రిన్స్‌ మహేష్‌బాబు పాల్గొన్న ఫొటో సెషన్‌కి అభిమానులు అనూహ్యంగా తరలివచ్చారు. ఆ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో కొంతమంది యువకులకు స్వల్పంగా, ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. కర్నూల్‌ ఎమ్మిగనూర్‌లోని ఓ థియేటర్‌లో ‘గోవిందుడు అందరివాడేలే’ ఫిల్మ్‌ టికెట్‌ తీసుకునేందుకు జనం క్యూలో నిలబడ్డప్పుడు జరిగిన తోపులాటలో ఓ వ్యక్తి కన్నుమూశాడు.

వరంగల్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ పిక్చర్‌ ‘బాద్షా’ ఆడియో లాంఛ్‌ సందర్భంగా తొక్కిసలాట జరిగి ఓ వీరాభిమాని ప్రాణాలు కోల్పోయాడు. ప్రభాస్‌ మరో సినిమా ‘మిర్చి’ ఆడియో విడుదలప్పుడూ పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. సినిమా విడుదల సందర్భంగా బ్యానర్లు కడుతూ కరెంట్‌ షాక్‌తో చనిపోయిన సందర్భాలూ ఉన్నాయి. కనీసం ఏడాదికొకటైనా ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. దీనికి ఏ ఒక్కరినో తప్పుపట్టాల్సిన పనిలేదు. ఒక్కోసారి ఈవెంట్‌ ఆర్గనైజర్లు పరిమితికి మించి పాసలు ఇస్తున్నారు. ఒక్కోసారి ఫ్యాన్స్‌ పిచ్చి అభిమానంతో ఎగబడుతున్నారు.

అదే సమయంలో సెక్యూరిటీ లోపాలూ బయటపడుతున్నాయి. హీరోలు, నిర్మాతలు, దర్శకులు ప్రచారం, అభిమానగణ ప్రదర్శన కోసం పాకులాడటమూ ప్రమాదాలకు దారితీస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఒకటీ రెండు చోట్లే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రోగ్రామ్స్‌ ప్లాన్‌ చేస్తే ప్రేక్షకుల తాకిడిని తట్టుకోవచ్చని పరిశీలకులు సూచిస్తున్నారు. ఇకనైనా ప్రాణనష్టం జరక్కుండా చూస్తారని ఆశిస్తున్నారు. ‘బింబిసార’ టైంలో భారీ వర్షం వచ్చింది. దీంతో అటుగా వెళ్లేవాళ్లు శిల్పకళా వేదిక వద్దకు చేరుకున్నారు. ఫలితంగా ఆ ఆడిటోరియం నుంచి అభిమానులు బయటికి రావటానికి వీల్లేకుండా పోయిందని చెబుతున్నారు.