NTV Telugu Site icon

Revanth Reddy: అన్ని మతాలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

Revanthreddy

Revanthreddy

సర్వమతాలకు రక్షణగా ఉండాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘డిసెంబర్ నెల ఒక మిరాకిల్ మంథ్. ఏసు ప్రభువు జన్మించిన నెల. సోనియా గాంధీ పుట్టిన నెల. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన నెల. ఇది మాకు ఎంతో ముఖ్యమైన నెల. ప్రపంచంలో అత్యధికంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే.. పొరుగువారిని ప్రేమించాలని ఏసు ప్రభువు సందేశం అందించారు. విద్య, వైద్యం విషయంలో ప్రభుత్వాలతో పోటీపడి క్రిస్టియన్స్ కూడా పేదలకు విద్య, వైద్య సేవలు అందించారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం కంటే ఎక్కువ నాణ్యమైన సేవలు అందించి సమాజ నిర్మాణంలో వారు భాగస్వామ్యం అవుతున్నందుకు వారికి అభినందనలు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో క్రిస్టియన్ సోదరుల పాత్ర ఎంతో ఉంది.’’ అని రేవంత్ రెడ్డి కొనియాడారు.

‘‘ఎవరు కూడా మరో మతానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడే చర్యలను ప్రభుత్వం సహించదు. ఎవరి విశ్వాసం వారు పాటించ వచ్చు… కానీ పరమత దూషణలు ప్రభుత్వం సహించదు. 100 శాతం తెలంగాణలో మీకు రక్షణ ఉంటుంది. పేదలకు అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం దళిత, గిరిజన, క్రిస్టియన్ సోదరులకు ఎంతో ఉపయోగపడుతుంది. సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు ప్రక్రియ మొదలవుతుంది. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో నిరుపేద దళితులు, దళిత క్రిస్టియన్స్‌కు లబ్ది చేకూరేలా ప్రభుత్వం ఆలోచ చేస్తోంది. ప్రభుత్వంలో మీకు సముచిత స్థానం కల్పిస్తుంది. భవిష్యత్‌లో పార్టీలోనూ సముచిత స్థానం కల్పించాలని పీసీసీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేస్తున్నా. క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వారి వివరాలు వారికి ఇస్తే సముచిత స్థానం కల్పిస్తారు. సంక్షేమ పథకాల్లో మీ కోటా, మీ వాటా మీకు అందించేలా ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంటుంది. ఇది అన్ని మతాలను సమానంగా చూసే ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం మీది.’’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివిధ క్రైస్తవ సంఘాల విశ్వాసులు హాజరయ్యారు.

Show comments