Champapet Murder : అన్నదమ్ముల గొడవలో దారుణం.. కత్తెరతో అన్నను చంపిన తమ్ముడు.!

  • తండ్రి మరణం తర్వాత పెరిగిన కుటుంబ కలహాలు
  • ఆవేశంలో కత్తెరతో అన్నపై దాడి
  • ఆస్పత్రికి తరలించేలోపే విషాదం
  • పరారీలో తమ్ముడు.. పోలీసుల గాలింపు

Champapet Murder : హైదరాబాద్ నగరంలోని చంపాపేట కుమ్మరి బస్తీలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ తగాదాల కారణంగా కన్న తమ్ముడే కసాయిగా మారి, కత్తెరతో పొడిచి సొంత అన్నను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చంపాపేట కుమ్మరి బస్తీలో నివాసముంటూ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న ముదావత్ వెంకటేష్ (28)కు, పక్క వీధిలోనే నివసిస్తున్న అతడి తమ్ముడు శివ (26)తో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. వీరి తండ్రి మరణించిన నాటి నుంచి అన్నదమ్ముల మధ్య కుటుంబ విషయాల్లో వివాదాలు మరింత తీవ్రస్థాయికి చేరాయి.

కత్తెరతో దాడి.. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు అనంతవాయువుల్లో

ఈ క్రమంలోనే శనివారం అన్నదమ్ముల మధ్య మరోసారి తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఆవేశానికి గురైన తమ్ముడు శివ, ఇంట్లోని కత్తెర తీసుకుని అన్న వెంకటేష్‌పై విచక్షణారహితంగా దాడి చేసి పొడిచేశాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌ను గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, మార్గమధ్యలోనే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అన్నను పొడిచిన అనంతరం నిందితుడు శివ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు శివ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.