Site icon NTV Telugu

Telangana : కుల ధ్రువీకరణ పత్రాల జారీకి కొత్త విధానం

Ts Gov Logo

Ts Gov Logo

రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాలను పొందడంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ సర్టిఫికెట్లు పొందడానికి దరఖాస్తు చేసి, ఎమ్మర్వో ఆమోదం కోసం వేచి చూడాల్సి వచ్చేది. ఎమ్మర్వో అందుబాటులో లేకపోతే లేదా ఇతర పరిపాలన సమస్యల వల్ల ఈ ధ్రువీకరణ పత్రం కోసం వారం నుంచి రెండు వారాల వరకు సమయం పట్టేది. ఈ జాప్యాన్ని తొలగించి ప్రజలకు తక్షణ సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రారంభించింది. ఇకపై బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు నేరుగా తమ సమీపంలోని మీ సేవ కేంద్రాల నుంచే కుల ధ్రువీకరణ పత్రాలను పొందగలరు. ఈ కొత్త విధానం గత 15 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్టు అధికారులు తెలిపారు.

కొత్త విధానం రూపకల్పన

ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు మీ సేవ విభాగం, సీసీఎల్‌ఏ, బీసీ సంక్షేమ, ఎస్సీ సంక్షేమ, జిల్లా పరిపాలనాధికారులు, తహసీల్దార్లు కలిసి పలు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ చర్చల అనంతరం కొత్త పద్ధతికి రూపం ఇవ్వబడింది. అధికారులు తెలిపిన ప్రకారం, గత 15 రోజులలోనే 17,571 మంది పౌరులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని వెల్లడించారు.

ఎలా పొందాలి?

మీ దగ్గర పాత కుల ధ్రువీకరణ పత్రం నెంబర్ ఉంటే, ఆ నెంబర్‌ను మీ సేవ కేంద్రంలో చెప్పగానే కొత్త ప్రింటవుట్‌ను వెంటనే పొందవచ్చు.

ఒకవేళ ఆ నెంబర్ గుర్తు లేకపోతే, మీ జిల్లా, మండలం, గ్రామం, ఉపకులం, పేరు ఆధారంగా సిబ్బంది రికార్డుల్లో శోధించి ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారు.

మరిన్ని వివరాల కోసం అధికారిక మీ సేవ వెబ్‌సైట్ లేదా సమీపంలోని మీ సేవ కేంద్రంను సంప్రదించవచ్చు.

 
ఈ కొత్త విధానం వల్ల పౌరులు ఇక జాప్యం లేకుండా తక్షణమే తమ కుల ధ్రువీకరణ పత్రాలను పొందగలుగుతున్నారు. ముఖ్యంగా పేదలు, విద్యార్థులు, ఉద్యోగార్థులు, సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా మారనుంది.

AP People Returned From Nepal: రాష్ట్ర ప్రభుత్వం చొరువతో స్వస్థలాలకు చేరుకున్న తెలుగు ప్రజలు!

Exit mobile version