BJP Suspended BJP MLA Raja Singh For Controversial Comments: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ని బీజేపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. అతను చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదం రేపడం, మైనార్టీలు ఆందోళనలు వ్యక్తం చేయడంతో.. హైకమాండ్ అతనిపై ఈ సీరియస్ యాక్షన్ తీసుకుంది. బీజేపీ శాసన సభ పక్ష నేత పదవీ నుంచి కూడా తొలగించింది. మిగతా బాధ్యతలన్నింటి నుంచి రాజాసింగ్‌ను తొలగిస్తున్నట్టు హైకమాండ్ స్పష్టం చేసింది. ఎందుకు సస్పెండ్ చేయకూడదో వివరణ ఇవ్వాలని, అందుకు పది రోజులు గడువు ఇస్తున్నామని బీజేపీ అధిష్టానం తెలిపింది. అటు.. రాజాసింగ్ చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో అతనిపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. నుపూర్ శర్మ ఎపిసోడ్‌తో రాజాసింగ్‌పై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియోను పోలీసులు యూట్యూబ్ నుంచి తొలగించారు.
కాగా.. మునవ్వర్ ఫారుఖీ కామెడీ షోను హైదరాబాద్‌లో నిర్వహించకూడదంటూ రాజాసింగ్ చాలారోజుల నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వచ్చారు. హిందూ దేవుళ్లను అవమానించిన వ్యక్తిని ఎలా అనుమతి ఇస్తారని, నగరంలో అతని షో నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. వేదికను తగలబెడతామని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే.. తీవ్ర ఉద్రిక్తల నేపథ్యంలో మునవ్వర్ షో ముగిసింది. అందుకు కౌంటర్‌గానే.. ముస్లిం మనోభావాలు దెబ్బతినేలా రాజాసింగ్ కామెడీ షో పేరుతో ఒక అభ్యంతకరమైన వీడియోని రిలీజ్ చేశారు. పదిన్నర నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో, మైనార్టీ వర్గాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్‌ను సస్పెండ్ చేస్తూ.. హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.