మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత చందుపట్ల జంగారెడ్డి మరణం పట్ల బీజేపీ నేతలు తీవ్ర సంతాపం తెలిపారు. మా అందరికీ మార్గదర్శకుడు మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి మరణం బాధాకరం. జంగారెడ్డి మరణంపట్ల బీజేపీ రాష్ట్ర శాఖ పక్షాన సంతాపం వ్యక్తం చేస్తున్నా అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జంగారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని, అట్లాగే వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
నిర్మొహమాటంగా, ధైర్యంగా మాట్లాడే వ్యక్తి… తప్పు చేస్తే మందలించే వ్యక్తి. నాకు వారు గురుతల్యులు.ఆర్ఎస్ఎస్ లో క్రియాశీల పాత్ర పోషించారు. జంగారెడ్డి 1967లో శాయంపేట నుండి తొలిసారి జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజా సేవకు అంకితమయ్యారు.
1984లో దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిపొందిన ఇద్దరు ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు జంగారెడ్డి. ఆనాడు పీవీ నర్సింహారావుపై భారీ మెజారిటీతో గెలిచిన నాయకుడు జంగారెడ్డి. జన సంఘ్ లో అత్యంత క్రియాశీల పాత్ర పోషించిన జంగారెడ్డి గారిని నక్సలైట్లు ఎన్నోసార్లు హతమారుస్తామని హెచ్చరించినా భయపడకుండా బీజేపీ బలోపేతం కోసం నిరంతరం పనిచేసిన మేరు నగధీరుడు జంగారెడ్డి అన్నారు బండి సంజయ్.
నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సేవకు అంకితమైన గొప్ప నాయకుడు జంగారెడ్డి గారు. ఆయన చివర శ్వాస వరకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన నేత. ఆయన మరణం పార్టీకి తీరని లోటు. ఆయన ఆలోచనలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు పాటు పడతాం.బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలి. ప్రజల జీవితాల్లో మార్పు తేవాలన్న జంగారెడ్డి నిరంతరం తపించే వారు.
ఈసారి పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని నాకు స్వయంగా ఫోన్ చేసి పలుమార్లు చెప్పే వారు.వారి ఆశయాలకు అనుగుణంగా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు అంతా కలిసి పనిచేస్తాం అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ వ్యవస్థాపకుల్లో జంగారెడ్డి ఒకరు. ఆయన మరణం రాష్ట్రానికి, పార్టీకి తీరని లోటు.
రైతు కుటుంబంలో జన్మించిన జంగారెడ్డి కష్టపడి పనిచేస్తూ పైకొచ్చిన నాయకుడు జంగారెడ్డి. జనం మధ్య పనిచేస్తూ ప్రజా ప్రతినిధిగా అనేక సార్లు గెలిచారు. పీవీ నర్సింహారావుపై ఎంపీగా విజయం సాధించిన నాయకుడు జంగారెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ సరఫరా చేయించడంలో, మోటార్లు కరెంటు మోటార్లు బిగించడంతో ఆయన కరెంట్ జంగన్నగా పేరుగాంచారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జంగారెడ్డి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుమారుడికి ఫోన్ చేసి పరామర్శించారు.కేంద్రం తరపున జంగారెడ్డి మరణంపట్ల ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా. కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించాలని భగవంతుడిని కోరుతున్నా అన్నారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్.విద్యా సాగర్ రావు మాట్లాడుతూ రాజకీయాల్లో మాకు స్పూర్తి ప్రదాత చందుపట్ల జంగారెడ్డి. పార్టీని గ్రామాల్లో బలోపేతం చేయడానికి, ప్రజలకు సేవ చేసేందుకు జంగారెడ్డి చేసిన కృషి చిరస్మరణీయం.
ఈరోజు బీజేపీ ఈ స్థాయిలో ఉందంటే… అందులో ముఖ్యపాత్ర జగ్గారెడ్డి పోషించారు.జంగారెడ్డికి దేశవ్యాప్తంగా పేరు రావడానికి కారణం 1984లో బీజేపీ తరపున ఇద్దరు ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు జంగారెడ్డి.తెలంగాణ తొలిదశ ఉద్యమంలో జంగారెడ్డి పాత్ర మరువలేనిది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతంలో జంగారెడ్డి పాత్ర క్రియాశీలకం.జంగారెడ్డి లాంటి వ్యక్తులు వేసిన పునాదులే ఈరోజు బీజేపీ మహా వ్రుక్షంగా ఎదగడానికి కారణమయ్యాయి. జంగారెడ్డి మాలాంటి వారితోపాటు నేటి తరానికి కూడా ఎంతో ఆదర్శనీయం.
జంగారెడ్డి కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుంది. జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా జంగారెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారన్నారు.