Site icon NTV Telugu

హామీలను అటకెక్కించడమే టీఆర్ఎస్ నేతలు చేసే పని : బీజేపీ నేత ఎస్.కుమార్

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డితో కలిసి బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ ఈరోజు జూమ్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్.కుమార్ మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ పై మంత్రులు, టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. బీజేపీ వైపు వేలు చూపించే ముందు టీఆర్ఎస్ నేతలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళిత, గిరిజనుల బతుకులు ఏం మారాయో టీఆర్ఎస్ నేతలు జవాబు చెప్పాలన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై బండి సంజయ్ సహా బీజేపీ నేతలు ప్రభుత్వ తీరును ఎండగడుతుంటే భరించలేక బీజేపీ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమ పదవుల కోసం… సీఎం మెప్పు పొందేందుకు బానిసలుగా బతుకున్నారన్నారు. ‘దళిత బంధు’ సంగతి ఏమైంది? ఈ పథకం కోసం డిపాజిట్ చేసిన రూ.1600 కోట్లు 4 నెలలైనా ఎందుకు లబ్దిదారుల ఖాతాల్లోకి మళ్లించలేదు? అని ఆయన ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో దళిత నియోజకవర్గాల్లో గెలిచిన 16 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డిపాజిట్ కూడా దక్కదని ఆయన జ్యోస్యం చెప్పారు. సీఎం నిర్వహించిన సర్వేల్లోనూ ఈ విషయం తేలిపోయిందని, అంబేద్కర్ జయంతి, వర్దంతిసహా ఏ ఒక్క కార్యక్రమానికి హాజరుకాని సీఎంను ఏనాడైనా దళిత టీఆర్ఎస్ నేతలు నిలదీశారా? అని ఆయన విమర్శించారు.

Exit mobile version