BJP Geetha Murthy Responds On Ibrahimpatnam Incident: ఇబ్రహీంపట్నం ఘటన చోటు చేసుకోవడానికి తెలంగాన ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై తూతూమంత్రంగా విచారణ చేస్తోందని సరిపోదని అన్నారు. ఆసుపత్రిలో సరైన వసతులు లేవని, వాటి మధ్య ఆపరేషన్లు నిర్వహించారని ఆమె మండిపడ్డారు. డ్రగ్స్‌లో, విమన్ ట్రాఫికింగ్‌లో, మహిళలపై దాడుల్లో తెలంగాణ ప్రభుత్వం నంబర్ వన్ స్థానంలో ఉందని ఆరోపించారు. ఇబ్రహీంపట్నం ఘటనకి బాధ్యత వహిస్తూ.. మంత్రి హరీష్ రావుని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
గురుకుల పాఠశాలలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయని.. సరైన వసతులు, భోజనం దొరక్క విద్యార్థినులు అవస్థలు పడుతున్నారని గీతా మూర్తి పేర్కొన్నారు. ఐఐటీలో స్టూడెంట్ చనిపోయినా కూడా ప్రభుత్వానికి పట్టదని, విద్యా మంత్రిగా ఉన్న సబిత తక్షణమే రాజీనామా చేయాలని కోరారు. మహిళా ముఖ్యమంత్రి లేదని తాము కొట్లాడామని, అప్పుడు సత్యవతి రాథోడ్‌కి మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు ఆ మంత్రి కూడా తెలంగాణలో మహిళలపై దాడులు జరుగుతుంటే.. చోద్యం చూస్తున్నారే తప్ప, పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యార్థినులపై లైంగిక దాడులు జరుగుతున్నా, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా.. కనీసం పరామర్శ కూడా ఉండట్లేదని ఆగ్రహించారు. అలాంటి సత్యవతిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
కాగా.. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఇబ్రహీంపట్నం ఘటన బాధితులను పరామర్శించడానికి గవర్నర్ తమిళిసై వెళ్లగా, ఆమెతో గీతా మూర్తి కలిశారు. ఈ ఘటనకు సంబంధించిన విషయాలపై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే బ్రహీంపట్నం ఘటనపై న్యాయం జరిగేలా చూస్తామని గవర్నర్ హామీ ఇచ్చారని గీతా మూర్తి వెల్లడించారు. చనిపోయిన కుటుంబాలకు రూ. 1 కోటితో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇవ్వాలని.. అలాగే పిల్లల చదువులకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించాలని కోరారు.