NTV Telugu Site icon

Bike Racers: పాతబస్తీలో బైక్ రేసర్లు వీరంగం.. యువకుడిపై కత్తితో దాడి

Bike Racers

Bike Racers

Bike Racers: పాతబస్తీలో బైక్‌ రేసర్లు రోడ్డుపై వీరంగం సృష్టించారు. బైక్ రేసింగ్ చేస్తున్న పోకిరీలను అడ్డుకున్న యువకుడిపై దారుణానికి పాల్పడ్డాడు. బైక్ రేసర్లంతా ఏకమై యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన పాత బస్తీలోని ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో షెజికి మజీద్ వద్ద కొందరు వ్యక్తులు బైక్ రేసింగ్ చేస్తుండగా స్థానిక యువకుడు రేసర్లను అడ్డుకున్నాడు. రోడ్లపై బైక్ రేసింగ్ ఏమిటి? అంటూ.. ఇక్కడ బైక్ రేసింగ్ చేయొద్దని హెచ్చరించారు. బైక్‌ రేసింగ్‌ల వల్ల వాహనదారులతో పాటు స్థానికులు కూడా ఇబ్బందులు పడుతున్నారని, రోడ్లపై ఇలాంటి విన్యాసాలు చేయవద్దని పోకిరీలకు సూచించారు. అవసరమైతే ఖాళీ ప్రదేశాల్లో వెళ్లి బైక్ రేసింగ్ చేయాని, ఇలా పబ్లిక్‌ గా రోడ్లపై బైక్‌రేసింగ్‌ ఎలా చేస్తారు? అని రేసర్లను అడిగాడు. దీంతో బైక్ రేసర్లకు, యువకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ యువకుడిపై పోకిరీలు విరుచుకుపడ్డారు.

Read also: Minister KTR: నేడు భూపాలపల్లిలో కేటీఆర్‌ పర్యటన.. 6 ప్రారంభోత్సవాలు, 2 శంకుస్థాపనలు

వారంతా యువకుడిపై కత్తులతో దాడి చేసి రణరంగం సృష్టించారు. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫలక్‌నుమా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రోడ్లపై బైక్ స్టంట్లు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

జాతీయ రహదారులపై వాహనాల అతివేగానికి అడ్డుకట్ట వేసి స్పీడ్ గన్ లు ఏర్పాటు చేసి ఏటా కోట్లాది రూపాయల జరిమానాలు వసూలు చేస్తున్న పోలీసులు వాహనాలు నడిపే కొందరు పోకిరీలపై చర్యలు తీసుకోవడం లేదని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో కొందరు విద్యార్థులు, యువకులు పోటీపడి రోడ్లపై విన్యాసాలు చేస్తూ పాదచారులు, ఇతర వాహనాలు భయాందోళనకు గురిచేస్తున్నారని పలువురు తెలిపారు. గతంలో ఇలాంటి ఘటనలు నగర శివారులో చోటుచేసుకుని కొందరు విద్యార్థులు, యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. రోడ్డుపై వేగంగా వెళుతుండగా సడన్ బ్రేక్ వేస్తే పెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారుల వెంబడి, బస్టాండ్‌ల చుట్టూ పోకిరీలు తమ ప్రతాపం చూపుతున్నారు. పోకిరీల బైక్ స్టంట్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Maternal Mortality: ప్రతీ రెండు నిమిషాలకు ఓ తల్లి మరణిస్తోంది.. యూఎన్ రిపోర్ట్..

Show comments