Bhatti Vikramarka : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని సీతమ్మ సాగర్, సీతారామ ప్రాజెక్టులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం పరిశీలించారు. ప్రాజెక్టు సందర్శన అనంతరం గోదావరి తీరంలో మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గోదావరిలో ప్రవహిస్తున్న జలాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలనే సంకల్పంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఇటీవల దేవాదుల ప్రాజెక్టును సందర్శించామని, నేడు సీతారామ ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించామని తెలిపారు. తెలంగాణలో చివరి ప్రాజెక్టు అయిన సీతారామ ద్వారా గోదావరి నీటిని గరిష్టంగా సద్వినియోగం చేసుకుంటామని ప్రకటించారు.
వైఎస్సార్ హయాంలోనే పునాది.. కేసీఆర్ పాలనలో వ్యయం పెంపు
గతంలో సీతారామ ప్రాజెక్ట్ స్థానంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘దుమ్ముగూడెం రాజీవ్ సాగర్’, ‘రుద్రంకోట ఇందిరా సాగర్’ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రణాళికలు రూపొందించారని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. అయితే, గత కేసీఆర్ ప్రభుత్వం రీ-డిజైనింగ్ పేరుతో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుల వ్యయాన్ని భారీగా పెంచిందని విమర్శించారు. రీ-డిజైనింగ్ నెపంతో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఏకంగా రూ. 24,000 కోట్లకు పెంచేసి ఖజానాపై అదనపు భారం మోపారని దుయ్యబట్టారు.
వెనక్కి తగ్గేదే లేదు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టులపై ఇప్పటికే భారీగా నిధులు ఖర్చు చేశారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ప్రజాధనం ఇప్పటికే అధిక మొత్తంలో వ్యయం కావడం వల్ల ఇప్పుడు ఈ ప్రాజెక్టులను నిలిపివేయడం సాధ్యం కాదని, అందుకే వీటిని ఎలాగైనా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందన్నారు. సీతారామ ప్రాజెక్టులో పెండింగ్‌లో ఉన్న మిగిలిన పనులన్నింటినీ యుద్ధప్రతిపాదికన, అత్యంత త్వరితగతిన పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. గోదావరి జలాలను మళ్లించడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాను పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేసి రైతాంగాన్ని ఆదుకుంటామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

