Bhatti Vikramarka : రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్ సర్వీసెస్ మెయిన్స్, ఇంటర్వ్యూ లకు ఎంతమంది ఎంపికైనా ఆర్థిక సహాయం అందిస్తాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం సాయంత్రం ఆయన ప్రజా భవన్ లో యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపికైన 50 మందికి చెక్కులు అందించిన అనంతరం ప్రసంగించారు. సివిల్ సర్వీసుల్లో విజయం సాధించి రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలని తపిస్తున్న అందరికీ అభినందనలని డిప్యూటీ సీఎం అన్నారు. రాష్ట్రం నుంచి ఎంత మంది ఎక్కువ ఎంపిక అయితే రాష్ట్రానికి అంత మంచిదని భావించి ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. అపారమైన మేధస్సు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఎంపిక కాలేకపోతున్నారన్న సమాచారం తెలుసుకొని ఆ ఇబ్బందులు తీర్చేందుకు సింగరేణి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని తీసుకువచ్చామని డిప్యూటీ సీఎం వివరించారు.
మెయిన్స్ కు ఎంపికైన వారికి లక్ష రూపాయలు ఆ తర్వాత ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఢిల్లీలో వసతి సౌకర్యం కల్పిస్తున్నట్టు వివరించారు. ఔత్సాహికులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తే పుస్తకాలు, ప్రయాణం, కోచింగ్ వంటి అవసరాలకు ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ పథకాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. మొదటిసారి 140 మంది మెయిన్స్ కు ఎంపిక కాగా అందులో 20 మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారని వివరించారు. వారికి రెండు దశల్లోనూ లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించామని అన్నారు. గత సంవత్సరం 20 మంది ఇంటర్వ్యూ కు వెళ్లగా అందులో ఏడుగురు సివిల్ సర్వీసెస్ కు ఎంపిక కావడం అభినందనీయం అన్నారు. ఏడుగురికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు యావత్ క్యాబినెట్ శుభాకాంక్షలు తెలియజేస్తుందని అన్నారు.
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువమంది సుమారు 202 మంది మెయిన్స్ కు ఎంపిక కాగా అందులో 50 మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారని తెలిపారు. గత సంవత్సరం 20 మంది ఇంటర్వ్యూకు ఎంపిక కాగా ఈసారి 50 మంది ఇంటర్వ్యూకు ఎంపిక కావడం అభినందనీయమని వచ్చేసారి ఈ సంఖ్య 100కు దాటి వెళ్లాలని అన్నారు.
మెయిన్స్ కు ఎంపికైన 50 మందికి రొటీన్ గా చెక్కులు అందజేయవచ్చు కానీ వారి అభిప్రాయాలు తెలుసుకొని భవిష్యత్తులో మరింతగా ఈ పథకాన్ని తీర్చిదిద్దేందుకు వారి అభిప్రాయాలు తెలుసుకోవాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇంటరాక్షన్ కార్యక్రమం ఏర్పాటు చేశాం దీని ద్వారా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఉంటుందని డిప్యూటీ సీఎం వివరించారు. ఇంటర్వ్యూకు వెళ్లే 50 మంది విజయం సాధించాలని వారు రాష్ట్రానికి ఎంపిక అయితే మంచిది, లేదంటే దేశంలో ఏ రాష్ట్రంలో సేవలు అందించిన వారు వారి తల్లిదండ్రులతో పాటు రాష్ట్రం పైన ప్రేమ చూపే అవకాశం ఉంటుందని వారి ఆలోచనలు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతాయని భావిస్తున్నట్టు తెలిపారు. కోట్లాది మంది ప్రజలు చెల్లించిన పన్నుల నుంచి మీకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది మీరు స్థిరపడిన తర్వాత మిమ్ములను పెంచి పోషించిన తల్లిదండ్రుల పట్ల ఎంత బాధ్యతగా ఉంటారో సమాజం పట్ల అంతే బాధ్యతగా ఉండాలని డిప్యూటీ సీఎం కోరారు. సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన తర్వాత ఆఫీసులకు వెళ్లే ప్రతిరోజు మీ సంతకం లక్షలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న ఆలోచనతో పనిచేయాలని డిప్యూటీ సీఎం కోరారు.
మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులు త్వరితగతిన కోచింగ్ సెంటర్లకు వెళ్లి మంచి శిక్షణ తీసుకోవాలని సమయం తక్కువగా ఉన్నందున అశ్రద్ధ చేయవద్దని తెలిపారు. ఇంటర్వ్యూ కు వెళ్లే సమయంలో ఢిల్లీలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సహాయం అందించేందుకు అక్కడ ప్రత్యేక ప్రతినిధులు ఉంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్ బ్యూరోక్రాట్లతో ఇంటర్వ్యూ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు ఈ మేరకు చీఫ్ సెక్రటరీతో తాను చర్చించినట్టు వివరించారు. ఇంటర్వ్యూ కు వెళ్లే అభ్యర్థులు విజయం సాధించాలని రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేయాలని తనకు చెప్పారని డిప్యూటీ సీఎం వివరించారు. ఇంటర్వ్యూ కు వెళ్లే అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం యావత్తు మద్దతుగా ఉంటుందని విజయం సాధించి రావాలని కోరారు.
సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్ర మంత్రి శ్ర పొన్నం ప్రభాకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలియజేశారు. ముందుగా సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ పేద వర్గాల నుంచి కూడా అభ్యర్థులు సివిల్స్ పరీక్షల్లో విజేతలుగా నిలవాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సివిల్స్ అభయహస్తం పథకానికి సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా సంపూర్ణ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. మొదటి ఏడాది మంచి స్పందన లభించిందని, రెండో ఏడాది రెట్టింపు స్పందనతో పాటు ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఫైనల్స్ కు ఎంపికవడం అభినందనీయమన్నారు.
ప్రిలిమ్స్ లో పాస్ అయిన వారితో పాటు ఫైనల్‌కు ఎంపికైన వారికి కూడా లక్ష రూపాయల చొప్పున ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించడంతో అభ్యర్థులు ఇతర సమస్యలపై దృష్టి మరల్చకుండా ఏకాగ్రతతో పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశం ఏర్పడిందని, ఈసారి 50 మంది అభ్యర్థులు ఫైనల్ ఇంటర్వ్యూ లకు ఎంపిక అవడం దీనికి ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు సంస్థ డైరెక్టర్ పర్సనల్ గౌతమ్ పొట్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్ర బి వెంకన్న ఫైనల్ ఇంటర్వ్యూలకు ఏ విధంగా సంసిద్ధం కావాలి అనే అంశం పైన చక్కని సూచనలు చేశారు. అభ్యర్థుల సందేహాలను కూడా నివృత్తి చేశారు.
ఇదే కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించిన సింగరేణి బ్రాండ్ శాలువాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు ఆవిష్కరించారు. అలాగే సింగరేణి జ్ఞాపికను ఆయన ఆవిష్కరించారు. ఇకపై సింగరేణి అధికారిక కార్యక్రమాల్లో వీటిని ఉపయోగిస్తామని, తెలంగాణ రైజింగ్ కార్యక్రమాల సందర్భంగా సింగరేణి అభివృద్ధి, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించాలన్న ఉద్దేశంతోనే వీటిని రూపొందించినట్లు సీఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ , మార్కెటింగ్ తాడబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Putin In India: మోడీతో డిన్నర్, రాష్ట్రపతితో సమావేశం.. పుతిన్ పూర్తి షెడ్యూల్ ఇదే..
