NTV Telugu Site icon

Bhatti Vikramarka: రేపటినుంచి భట్టి పాదయాత్ర తిరిగి ప్రారంభం

కాంగ్రెస్ శాసనసభా పక్షం నేత భట్టి విక్రమార్క రేపటినుంచి మళ్లీ పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కారణంగా నిలిచి పోయిన పాదయాత్ర కొనసాగించనున్నారు. నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకునేందుకు, అదేవిధంగా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వచ్చేందుకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

పీపుల్స్ మార్చ్ పేరిట గత నెల 27న ముదిగొండ మండలం యడవెల్లిలో పాదయాత్రను చేపట్టారు. అసెంబ్లీ సమావేశాల వల్ల 102 కిలోమీటర్ల దూరం కొనసాగిన యాత్ర గంధసిరి వద్ద ఈ నెల అయిదున పాద యాత్రను అర్ధాంతరంగా ముగించారు. మళ్లీ అసెంబ్లీ సమావేశాల తరువాత కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మధిర నియోజకవర్గంలోని ముదిగొండ, చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో ముందుగా ఈ పాదయాత్రను కొనసాగించాలని నిర్ణయించారు. అయితే ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలోని శ్రీ వెలుగొండ స్వామి సన్నిధి నుంచి భట్టి విక్రమార్క రేపటి నుంచి తన పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తారు.

అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడటంతో తిరిగి ప్రజాసమస్యల పరిష్కారం కొరకు మధిర నియోజకవర్గంలోని చింతకాని, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని అన్ని గ్రామాల్లో కాలి నడక ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి భట్టి విక్రమార్క తన పాదయాత్రను కొనసాగించనున్నారు. ఈ పాదయాత్ర విజయవంతం చేయడానికి ఇప్పటికే అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని ప్రణాళికను సిద్దం చేశారు. ఈ నెల 25న ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలోని శ్రీ వెలుగొండ స్వామి సన్నిధి నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. అదే రోజున వల్లాపురం మీదుగా చింతకాని మండలం నామవరం, మత్కేపల్లి, జగన్నాధపురం గ్రామాల్లో కొనసాగుతుంది.