ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో దళితులు నిరసన తెలిపి వెళ్లారనే సాకుతో పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమం నిర్వహించడంపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దళితులు నడిచిన నేలను కడిగేయడం సభ్య సమాజానికి పెద్ద అవమానమని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఫ్యూడల్ భావజాలానికి స్థానం లేదని స్పష్టం చేశారు. శాసనసభ వేదికగా ప్రతిపక్ష బీఆర్ఎస్ , కేంద్రంలో ఏలుతున్న బీజేపీల కుల వివక్ష వైఖరిని ఆయన ఎండగట్టారు.
మనుషుల కంటే కులం గొప్పదా?
ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి దళిత నేతలు వెళ్లిన తర్వాత బీఆర్‌ఎస్ వర్గాలు అక్కడ పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయడంపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు నడిస్తే భూమి అపవిత్రమవుతుందా అని ప్రశ్నించారు. శుద్ధి చేయాల్సింది నేలను కాదు, కులజాడ్యంతో నిండిన బుద్ధిని అని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్న దళిత నేతను ప్రతిపక్ష సభ్యులు అవమానించిన ఘటన సభను తీవ్ర క్షోభకు గురిచేసిందని, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్లీ మళ్లీ వివక్షపూరిత చర్యలకు తెగబడటం సరికాదని హితవు పలికారు.
రాజ్యాంగం ఇచ్చిన ఆత్మగౌరవంపై దాడి
తెలంగాణ రాష్ట్ర పునాదులే ఆత్మగౌరవం , సామాజిక న్యాయంపై నిర్మితమయ్యాయని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. మనుషుల కంటే కులం గొప్పది కాదని మహనీయులు చెప్పిన పాఠాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఓటు హక్కుతో పాటు స్వేచ్ఛగా, సమానత్వంతో జీవించే హక్కును కల్పించిందని, ఇంకా భూస్వామ్య విధానంలో బతుకుతున్నామనే భ్రమల్లో ఉన్నవారి ఆలోచనలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.
బీజేపీ తీరుపై కూడా ధ్వజం
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ ముగిసిన తర్వాత బీజేపీ నేతలు ఆ ప్రాంగణాన్ని శుద్ధి చేసిన ఘటనను భట్టి విక్రమార్క ప్రస్తావించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఖర్గే స్థాయి నాయకుడిని కేవలం ఆయన కులాన్ని బట్టి బీజేపీ అవమానించినా ఆ పార్టీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. ఢిల్లీలో బీజేపీ చూపించే వివక్షనే ఇక్కడ బీఆర్‌ఎస్ పునరావృతం చేస్తోందని, ప్రజలు ఈ వివక్ష రాజకీయాలను ఖచ్చితంగా తిప్పికొడతారని భట్టి హెచ్చరించారు.

