నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ విజయభేరి కార్నర్ మీటింగ్, జడ్చర్లలో నిర్వహించిన రోడ్ షో మీటింగ్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు బీఆర్ఎస్ పాలనలో నీళ్లు రాలేదని మండిపడ్డారు. ఉద్యోగాలు రాలేదని, నిధులు ఆగమైనాయని, పేదలకు ఇల్లు రాలేదని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు కన్నటువంటి కలలు కన్నీళ్లు పాలయ్యాయని,
మన కలలు నిజం కావాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతోనే సాధ్యమన్నారు భట్టి విక్రమార్క.
బీసీల జనగణన జరిగితేనే బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని, బీసీల జనగణన చేయాలని పార్లమెంట్‌లో మనందరి కోసం గొంతెత్తి రాహుల్ గాంధీ గారు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తండాల్లో ఉన్న లంబాడి సోదరీ సోదరులకు రిజర్వేషన్లు కల్పించిన దివంగత ప్రధాని ఇందిరమ్మను ఈ ఎన్నికల సందర్భంగా గుర్తు చేసుకొని చెయ్యి గుర్తుపై ఓటు వేయాలని, భూసంస్కరణలు తీసుకువచ్చి దళిత గిరిజన పేదలకు భూములు పంపిణీ చేసిన కాంగ్రెస్ ను గుర్తు పెట్టుకొని చెయ్యి గుర్తుపై ఓటు వేయాలన్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఇంటింటికి తీసుకువెళ్లి కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని, ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ ని గెలిపించుకోవాలన్నారు భట్టి విక్రమార్క. కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.