సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా ఎపిసోడ్ తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తనపై కోవర్ట్ ముద్ర వేసి అవమానాలకు గురిచేస్తున్నారని.. బాధతో రాజీనామా చేస్తున్నట్లు జగ్గారెడ్డి టీ కాంగ్రెస్‌లో ప్రకంపనలు పుట్టించారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ ఎమ్మెల్యే అయిన జగ్గా రెడ్డి ప్రకటనతో పార్టీలో ఒక్కసారిగా అలజడి రేగింది. గాంధీ కుటుంబంపై అభిమానం ఉన్నప్పటికీ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకునేందుకే పార్టీని వీడనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ నేపథ్యంలో నేడు సీఎల్పీ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి లు ఎమ్మెల్యే జగ్గారెడ్డితో సమావేశమై ఆయనను శాంతింపజేసే ప్రయత్నాలు చేసినట్లు కనిపిస్తోంది.
అయితే ఈ సమావేశం అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. జగ్గారెడ్డిని తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని కోరినట్లు ఆయన తెలిపారు. పార్టీ అంతర్గత అంశాల పై జగ్గారెడ్డి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారని, జగ్గారెడ్డి పార్టీ మారరు అని అనుకుంటున్నానని ఆయన వెల్లడించారు. రేపు మరోసారి సమావేశం కానున్నట్లు రేపటి సమావేశానికి రాజీనామా కి సంబంధం లేదు, బడ్జెట్ సమావేశాలు వస్తే మళ్లీ యాక్టివ్ అవుతామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.