NTV Telugu Site icon

ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనం.. ప్రభుత్వం ఆర్డినెస్స్‌ తేవాలి..!

ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.. అయితే, దీనికి కారణం మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే అని ఆరోపిస్తోంది భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి.. వినాయక నిమజ్జనంపై సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు.. తెలంగాణ కేబినెట్‌ సమావేశం నిర్వహించి ఆర్డినెన్స్ తీసుకురావాలని.. జల్లికట్టు, శబరిమల మాదిరిగా తెలంగాణ సర్కారు ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్‌ చేశారు.. ఇక, రాష్ట్ర సర్కారు న్యాయ స్థానం ముందు కాలుష్యం విషయంలో వివరాలు పెట్టలేదని ఆరోపించారు భగవంతరావు.

ఇక, గణేష్ ఉత్సవ నిమజ్జనం సజావుగా జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది భాగ్యనగర్‌ గణేష్ ఉత్సవ సమితి.. రేపు 10 నుంచి 11 గంటల వరకు ధర్నా నిర్వహిస్తామని… కాషాయ, నల్ల జెండాలు ప్రదర్శిస్తామని తెలిపారు.. ఇవాళ రాష్ట్ర గణేష్ మండలపాల దగ్గర బైక్ ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు.. గణేష్ నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తీసుకు రావడానికి కార్యాచరణ ప్రకటించినట్టు వెల్లడించారు భగవంతరావు.. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ప్రభుత్వ కార్యాచరణ బట్టి… తదుపరి కార్యక్రమం ఉంటుందని.. అవసరం అయితే తెలంగాణ బంద్ కు రెడీ అవుతున్నామన్నారు.. ప్రస్తుత ప్రతిష్టంభనకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న ఆయన.. రెండు… మూడు లక్షల విగ్రహాలు ఉన్నాయి… ఎక్కడ నిమజ్జనం చేయాలి? అని ప్రశ్నించారు.