NTV Telugu Site icon

Munugode Bypoll: మునుగోడులో గెలుపెవరిది..? రంగంలోకి బెట్టింగ్‌ రాయుళ్లు..!

Munugode Bypoll

Munugode Bypoll

మునుగోడు ఉప ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌కు సమయం దగ్గర పడింది… నిన్న సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడగా.. ప్రలోభాలపర్వం జోరుగా సాగుతోంది… ఓ వైపు మద్యం.. మరోవైపు డబ్బులు పంపిణీకి తెరలేపాయి ఆయా పార్టీలు.. ఇక, క్రికెట్‌ మ్యాచ్‌లకే పరిమితం కాదు.. ఏదైనా ఎన్నికలు జరిగినా..? ఆ ఎన్నికలపై ప్రముఖంగా చర్చ సాగుతున్నా.. బెట్టింగ్‌ రాయుళ్లు దిగిపోతున్నారు.. ఇప్పుడు వాళ్ల దృష్టి మునుగోడు బైపోల్‌పై పడింది.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంటుందని.. ఓ రెండు పార్టీల మధ్యే గట్టి పోటీ జరుగుతుందని.. ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతోనే బయటపడే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.. దీనిని క్యాష్‌ చేసుకోవడానికి రంగంలోకి దిగిన బెట్టింగ్‌ రాయుళ్లు.. మునుగోడులో గెలుపెవరిది? అంటూ బెట్టింగ్‌లు కాస్తున్నారు..

Read Also: Challa Bhageerath Reddy is No More: ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూత

వెయ్యికి రెండు వేల రూపాయలు.. లక్షకు రెండు లక్షల రూపాయలు అంటూ.. కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుందనే ప్రచారం సాగుతోంది.. హైదరాబాద్‌లోని హోటల్స్‌లో తిష్టవేసిన బూకీలు.. మధ్య వర్తులుగా ఏజంట్స్‌ను పెట్టుకుని బెట్టింగ్‌ చేస్తున్నారట.. కొందరు నచ్చిన పార్టీపై బెట్టింగ్‌ కాస్తుంటే.. కొందరు ఎవరు గెలిచే అవకాశం ఉంది? అనే విషయాలను బేరీజు వేసుకుని డబ్బులు పెడుతున్నారట.. బెట్టింగ్‌ పర్వంలో అడ్వాన్స్‌ల రూపంలోనూ డబ్బుల వసూళ్లు, చెల్లింపులు సాగుతున్నాయని తెలుస్తోంది.. క్రికెట్‌ మ్యాచ్‌ల తరహాలోనే మునుగోడు బైపోల్‌ బెట్టింగ్ జరుగుతోంది. ఏ పార్టీది విన్‌..? ఎవరికి ఎంత పోలింగ్ పర్సంటేజ్‌..? ఏ రౌండ్‌లో ఎవ్వరికి ఎక్కువగా ఓట్లు వస్తాయి? ఇలా రకరకాలుగా బెట్టింగ్‌ కాస్తున్నారట.. అంతేకాదు.. గెలిచి నిలిచే పార్టీ ఏది? గెలిచినవారికి మెజార్టీ ఎంత..? డిపాజిట్ సాధించేదెవరు? డిపాజిట్‌ కోల్పోయేదెవరు? లాంటి అంశాలపై సైతం బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయట.. మరోవైపు ప్రలోభాలపర్వంపై నిఘా పెట్టిన ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు.. బెట్టింగ్‌ రాయుళ్లపై కూడా ఓ కన్నువేసిందట.. టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌వోటీ పోలీసును రంగంలోకి దించినట్టు తెలుస్తోంది.