కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిందే బాసరలోని ఆర్టీయూకేటీ. కొన్నేళ్లుగా నిర్వహణ లోపంతో సమస్యలు చుట్టుముట్టాయి. కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కో సమస్య వెలుగులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం కోసం ఎన్టీవీ సాహసం చేసింది. సమస్యల సుడిగుండంలో ఉన్న విద్యార్థులను ఎన్టీవీ బృందం పలకరించింది. దారుణమైన పరిస్థితి ఉందంటూ ఎన్టీవీతో విద్యార్థులు గోడు వెళ్లబోసుకున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యల జాతర కొనసాగుతోంది. హాస్టల్ గదుల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది. అయిదేళ్లుగా విరిగిపోయిన మంచాలు, చిరిగిపోయిన పరుపులతో నెట్టుకొస్తున్నారు.పదేళ్ల కాలానికిగాను తాత్కాలికంగా 2008లో నిర్మించిన రేకుల షెడ్లలో కొన్ని సెక్షన్లకు ఇంటర్ తరగతులు నిర్వహిస్తున్నారు. చాలా భవనాల సీలింగ్ పైకప్పులు విరిగి పడుతున్నాయి. రేకులు ధ్వంసమయ్యాయి.వసతి గృహాల్లో డ్రైనేజీ పైపులు చాలా చోట్ల పగిలిపోయాయి. లీకవుతున్న మురుగుతో దుర్గంధం నడుమ విద్యార్థులు సతమతమవుతున్నారు. తరగతులు, వసతిగృహాల గదులు, కిటికీల తలుపులు, అద్దాలు పగిలిపోయాయి. మరుగుదొడ్ల తలుపులు ఊడిపోగా, చాలా చోట్ల వినియోగించలేని స్థితిలో ఉన్నాయి.. కొన్నిచోట్ల విద్యుత్తు బోర్డులు, లైట్లు ధ్వంసమ య్యాయి. తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి.
2008లో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మూడు ఆర్జీయూకేటీల్లో బాసర ఒకటి. బోధన, వసతిపరంగా వెనుకబడటంతో విద్యాలయ ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతోంది. ఎనిమిదివేల మంది విద్యార్థుల భవితకు ఇబ్బంది కలుగుతోంది. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఐఐఐటీలో సమస్యలు తిష్ట వేసుకున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీవీ విద్యార్థుల సమస్యలపై వారిని పలకరించింది.
Reactor Blast: వెలిమినేడులో పేలిన రియాక్టర్.. భారీగా వెలువడిన విషవాయువులు