NTV Telugu Site icon

Hyderabad:రాత్రి 11 గంటల తరువాత ప‌బ్బులు, మ‌ద్యం బంద్‌

Hyderabad

Hyderabad

నగరంలో ఇకపై 24 గంటలు బార్లు, రెస్టారెంట్లు, పబ్బులలో మద్యం అనుతించబడదని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల, ప్రతినిధుల దృష్ట్యా ఐదంతస్తుల రేటింగ్‌ ఉన్న హోటల్‌కు 24 గంటలు మద్యం అనుమతి ఉంటుందని తెలిపారు. అయితే, అది సాధారణ ప్రజలకు కాదని, ఆయా హోటల్స్‌లో ఉండే పర్యాటకులకు మాత్రమేనని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్నపాటి లాభాల కోసం నిబంధనలు ఉల్లంఘిస్తూ హైదరాబాద్‌కు అపఖ్యాతి తీసుకురావద్దని పబ్బులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, డ్రైవ్‌- ఇన్‌ రెస్టారెంట్స్‌ యజమానులకు నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సూచించారు. నగర పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో హైదరాబాద్‌లో ఉన్న పబ్బులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్ల నిర్వాహకులతో సీపీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. ఇటీవల బంజారాహిల్స్‌లో పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో తనిఖీలు చేసిన పోలీసులకు కొకైన్‌ లభించిన విషయాన్ని గుర్తు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నదని, దీంతో ప్రశాంతమైన వాతావరణం నెలకొని పెట్టుబడులకు అనువైన నగరంగా హైదరాబాద్‌ మారిందని తెలిపారు. ఇలాంటి సమయంలో.. కొంత మంది బార్లు, పబ్బుల యజమానులు చిన్న చిన్న లాభాల కోసం నిబంధనలు అతిక్రమిస్తున్నారని, భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరుగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పబ్బులు, బార్ల నుంచి వెలువడే ధ్వనులు పరిమితి స్థాయి కంటే అధికంగా ఉండటం, పబ్బులకు వచ్చిపోయే వారి వాహనాలతో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడటం, మద్యం మత్తులో బయటకు వచ్చిన కొందరు రహదారులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలపై ఆయా ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. సీసీ కెమెరాలకు సంబంధించిన బ్యాకప్‌ 30 రోజులు తప్పని సరిగా ఉండాలని సూచించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించి,చర్యలు తీసుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

రాత్రి 11 గంటల తరువాత వచ్చే ఆర్డర్లను అనుతించవద్దని, 12 గంటల లోపు తమ సంస్థలను మూసేయాలని సీపీ సూచించారు. వీకెండ్స్‌ (శుక్ర, శని వారాల) దృష్ట్యా అరగంట గ్రేస్‌ పీరియడ్‌తో పాటు అదనంగా ఒక గంట మినహాయింపు ఉంటుందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పబ్బు ముగింపు సమయానికి పది నిమిషాల ముందే లైట్లను డిమ్‌ చేస్తారని, తద్వారా కస్టమర్లకు పబ్బు మూసేసే సమయం అయ్యిందని తెలిసిపోతున్నదన్నారు. నగరంలో కూడా ఈ పద్ధతిని పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు సీపీ వీఆర్‌.శ్రీనివాస్‌, జాయింట్‌ సీపీలు రమేశ్‌, విశ్వప్రసాద్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.
Delhi Fire Accident: ఢిల్లీ అగ్నిప్రమాదంలో 27 మంది మృతి..