Nirudyoga March: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో శనివారం వరంగల్‌లో నిరుద్యోగ యాత్ర నిర్వహించనున్నారు. పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని, రూ.లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్లతో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు సీనియర్ నేతలు హాజరుకానున్నారు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ నుంచి నయీంనగర్, పెట్రోల్ పంప్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ మీదుగా అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ర్యాలీ దాదాపు 2 కిలోమీటర్ల మేర సాగనుంది.
17 షరతులు…
17 షరతులు విధిస్తూ బీజేపీ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. రహదారికి ఒకవైపు మాత్రమే ర్యాలీ నిర్వహించాలి. ఈ ర్యాలీలో నిరుద్యోగులు, విద్యార్థులు, పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొననుండటంతో నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ర్యాలీ ఏర్పాట్లను బీజేపీ నేతలు పూర్తి చేశారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగ యాత్ర నిర్వహణ కమిటీ సభ్యులు మూడు రోజులుగా వరంగల్ లోనే మకాం వేశారు. వరంగల్, హనుమకొండ నగరాల్లో పెద్ద ఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వరంగల్‌లోని యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల వద్ద నిరుద్యోగులకు పోస్టర్లు పంపిణీ చేసి నిరుద్యోగ యాత్రలో పాల్గొనాలని కోరారు. నిరుద్యోగ యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు, కళాకారులు ఆయా కేంద్రాలకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ ర్యాలీకి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. కాగా, ర్యాలీని విజయవంతం చేయాలని నిరుద్యోగ యాత్ర నిర్వహణ కమిటీ కన్వీనర్ గంగిడి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. నిరుద్యోగులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. త్వరలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ యాత్రలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 18న మహబూబ్ నగర్, 21న ఖమ్మంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.