నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్‌పై నేడు జరిగిన దాడిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. టీఆర్ఎస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన ప్రకటనలో వెల్లడించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత వైఖరిని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక భౌతిక దాడులకు తెగబడటం సిగ్గు చేటని, ఇది ముమ్మాటికీ పిరికిపంద చర్య అని బండి సంజయ్ అన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా టీఆర్ఎస్ దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని కోరుతున్నామని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. సీఎం కేసీఆర్ పాలనను, టీఆర్ఎస్ నేతల తీరును ప్రజల అసహ్యించుకుంటున్నారు. అయినా వారిలో మార్పు రాకపోగా ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు తెగబడటం వారి అవివేకానికి నిదర్శనమని, టీఆర్ఎస్ నేతల బెదిరింపులకు, దాడులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు బండి సంజయ్.
Bhatti Vikramarka : భద్రాచలంకు భట్టి విక్రమార్క..
ప్రజా సమస్యలపై నిలదీస్తూనే ఉంటామని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరును కొనసాగిస్తూనే ఉంటామన్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ.. పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొనే సత్తా లేక చేస్తున్న చర్యలు ఇవి అన్నారు. బీజేపీకి వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేక దాడులకు దిగడం హేయమైన చర్య అని, ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. ప్రజా క్షేత్రంలో మీకు శిక్ష తప్పదని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.