Bandi Sanjay Praja Sangrama Yatra To Start From Tomorrow: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రాయ యాత్రకు హైకోర్టు నుంచి అనుమతి లభించింది. యాత్ర నిలిపివేయాలని పోలీసులు ఇచ్చిన నోటీసుల్ని కొట్టివేసింది. దీంతో.. రేపట్నుంచి యాత్రను తిరిగి ప్రారంభించేందుకు బీజేపీ నేతలు సమాయమత్తమవుతున్నారు. అయితే.. మూడు రోజులు జరిగిన జాప్యం కారణంగా, పాదయాత్రను కుదించాలని నిర్ణయించుకున్నారు. రేపు, ఎల్లుండి కలుపుకొని మొత్తం 30 కి.మీ. పాదయాత్రతో ఈ యాత్రను ముగించాలని డిసైడ్ అయ్యారు. ఆగిన చోట నుండే పాదయాత్ర ప్రారంభమవుతుందని, రోజుకు 20 కి.మీ.లకు పైగా నడిచేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారని బీజేపీ నేతలు అన్నారు.
రేపు ఉదయం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం పామ్నూర్ నుంచి పాదయాత్ర షురూ కానున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పామ్నూరుకి బండి సంజయ్ వెళ్లారు. ఆ నియోజకవర్గంలోనే ఈ రోజు రాత్రి బస చేయనున్నారు. ఈనెల 27న మధ్యాహ్నం వరకు ఈ యాత్ర సాగుతుందని, 27న హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ వద్ద జరిగే బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. బండి సంజయ్ నిర్ణయంతో పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్ వచ్చిందని.. రేపటి పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున యువత సిద్ధమైందని తెలిపారు. 27న జరిగే బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తల సన్నాహాలు చేస్తున్నారు.