Site icon NTV Telugu

ఉద్యోగుల స్థానికతకు పెను ప్రమాదం..! ఆ జీవో నిలిపివేయాలి

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 317పై అభ్యంతరం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. ప్రభుత్వం జారీ చేసిన 317 ఉత్తర్వులతో ఉద్యోగుల స్థానికతకు పెను ప్రమాదం ఏర్పడిందన్న ఆయన.. ముఖ్యమంత్రి తుగ్లక్‌ పాలనకు ఇది నిదర్శనం అని మండిపడ్డారు. స్థానికులైన ఉద్యోగులు జోనల్ విధానంలో ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. సీఎం కేసీఆర్.. సీనియర్, జూనియర్ పేరుతో ఉద్యోగుల్లో చీలిక తీసుకొస్తూ రాజకీయలబ్ధి పొందే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.. ఇప్పటికే ప్రమోషన్లు దక్కక, ఇతరత్రా సమస్యలతో సతమతమవుతున్న ఉద్యోగులను మరింత ఇబ్బంది పెట్టేలా సీఎం వ్యవహరిస్తున్నారని.. పాత సమస్యను దారిమళ్లించేందుకు ఎప్పటికప్పుడు కొత్త సమస్యను తెరమీదకు తెస్తూ రాజకీయంగా పబ్బం గడపుకోవడం సీఎంకు అలవాటుగా మారిందన్నారు.

ఇక, ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలను కమీషన్లుగా దండుకున్న సీఎం కేసీఆర్‌.. ఆ డబ్బుతోపాటు ఉద్యోగుల సమస్యలనూ దాచిపెడుతూ… తనకు అవసరమైనప్పుడు మాత్రమే వాటిని బయటకు తీస్తూ రాజకీయ డ్రామాలాడుతూ గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్.. ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం సృష్టున్న ఆ జీవో అమలును తక్షణమే నిలిపివేయాలన్న ఆయన.. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్న తర్వాతే జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు జరపాలన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల స్పూర్తిని దెబ్బతీయకుండా నిర్ణయం తీసుకోవాలని సూచించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌.

Exit mobile version