రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ మేడారం జాతరలో పాల్గొన్నారు.ఈ పర్యటనలో మంత్రులు, కలెక్టర్, ఎస్పీ గైర్హాజర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర తొలి పౌరురాలికి ఇంత అవమానమా? గవర్నర్ కు ఇచ్చే మర్యాద ఇదేనా? మహిళ అని చూడకుండా అవమానిస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదేనా కల్వకుంట్ల రాజ్యాంగం ?కోట్లాదిమంది ప్రజలు సందర్శించే మేడారం జాతరకు వెళ్లకుండా గిరిజనులను సీఎం కేసీఆర్ అవమానించారని మండిపడ్డారు బండి సంజయ్. తక్షణమే రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు బండి సంజయ్.
ఇదిలా వుంటే… గవర్నర్ తమిళి సై మేడారం పర్యటనలో ప్రొటోకాల్ వివాదం తెరపైకి వచ్చింది. గవర్నర్ తమిళిసై మేడారం మహా జాతరకు వస్తే.. కనీసం రిసీవ్ చేసుకోవడానికి కూడా మంత్రులు రాకపోవడంతో వివాదం మొదలైంది. అప్పటి వరకు అక్కడే ఉన్న మంత్రులు.. గవర్నర్ వచ్చే సమయానికి అక్కడి నుంచి వెళ్లిపోయారని అంటున్నారు. అయితే, హెలికాప్టర్‌లో కాకుండా వరంగల్ మీదుగా రోడ్డు మార్గాన ములుగు జిల్లాకు చేరుకున్న గవర్నర్ తమిళిసైకి స్థానిక ఎమ్మెల్యే సీతక్క స్వాగతం పలికారు.. కానీ, మంత్రులు లేకపోవడంతో ప్రొటోకాల్ రగడ కొనసాగుతోంది.
వన దేవతలు సమ్మక్క సారలమ్మలను అతి పెద్ద గిరిజన జాతర మేడారంలో దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోవడం సంతోషంగా ఉందన్నారు.. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి ఈ అతి గొప్ప ఆదివాసీ జాతర ఆదర్శంగా నిలుస్తుందని వెల్లడించారు.. తెలంగాణ ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని వనదేవతలను కోరుకున్నట్టు తెలిపారు.