Bandi Sanjay: తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ బాసర ఆర్జీయూకేటీలో శనివారం రాత్రి నుంచి విద్యార్థులు భోజనం చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేసేందుకు కూడా విద్యార్థులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆందోళన గురించి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. బాసర ట్రిపుల్ ఐటీ విషయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. దీనిపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తున్నారని పేర్కొన్నారు. రోజురోజుకూ ఈ సమస్య జటిలమవుతోందన్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని.. అయినా ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీలో కనీసం మీడియాను కూడా అనుమతించడం లేదన్నారు.
ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రి పాలైనా పట్టించుకోవడం లేదని.. భోజనం వండేందుకు కనీసం షెడ్లు కూడా సరిగ్గా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన విద్యా సంస్థలను కాపాడుకునే తెలివి కేసీఆర్‌కి లేదన్నారు. ఇక్కడ ఇంత జరుగుతుంటే కేసీఆర్ ఢిల్లీకి పోయి ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం మొత్తం ఎక్కడ పోయిందని చర్చించుకుంటున్నారని అన్నారు. సోయం బాపురావు ఆధ్వర్యంలో సమస్యలు పరిశీలించేందుకు వర్సిటీకి వెళ్తే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ఆయన స్థానిక ఎంపీ. ఆయన్ను కూడా పంపించరా అంటూ మండి పడ్డారు. మీరు, మీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలాగు వెళ్లరు.. స్థానిక ఎంపీ వెళ్తే అరెస్టులా అంటూ ఆగ్రహించారు. ఢిల్లీకి తెలంగాణ ప్రజల కోసం వెళ్లావా.. మీ సొంత పనులకు పోయారా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.
పోలీసులు బీజేపీ నాయకుల కాళ్లపై నుంచి కార్లు ఎక్కిస్తున్నారని.. బీజేపీ నాయకులను చంపే కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. పోలీసులు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని ఆరోపణలు చేశారు. భైంసా ఘటన రిపీట్ చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ముఖ్యమంత్రికి భయపడుతున్నారని చెప్పారు. సోయం బాపురావును పోలీసులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు చేతకాకుంటే వర్సిటీని తమకు అప్పగించాలని.. తామే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. విద్యార్థులకు నీళ్ల చారుతో భోజనం పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Basara: “బాసర” అంటే బాధ మాత్రమే కాదు. ఈ విజయగాథ కూడా..
విద్యార్థుల ఆందోళనకు కారణం: ఇటీవల ఆర్జీయూకేటీలో ఆహారం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు భోజనశాల నిర్వాహకుల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు నూతన నిర్వాహకులను నియమించి నాణ్యతగా భోజనం అందించాలంటూ ఇన్‌ఛార్జి ఉపకులపతి వెంకటరమణకు ఇటీవల విన్నవించారు. దీంతో పాటు మరికొన్ని డిమాండ్లనూ వీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమస్యలను 24వ తేదీలోపు పరిష్కరిస్తామని ఇన్‌ఛార్జి వీసీ వారికి భరోసా ఇచ్చారు. గడువు ముగిసి ఐదు రోజులు పూర్తయినా డిమాండ్లను నెరవేర్చక పోవడంతో విద్యార్థులు శనివారం రాత్రి నుంచి ఆందోళనకు దిగారు.