తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహణకు సిద్ధం అవుతుంది.. ఈ నెల 12వ తేదీన టెట్ నిర్వహిస్తామని నోటిఫికేషన్ ద్వారానే కాదు.. ఆ తర్వాత కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.. అయితే, అదే రోజు ఆర్‌ఆర్‌బీ పరీక్ష ఉండడంతో… విద్యార్థి, యువజన సంఘాలతో పాటు.. విపక్షాలు కూడా టెట్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి.. తాజాగా, ఈ వ్యవహారంపై స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
Read Also: Surprise Gift: యువకుడి సాహసం.. గిఫ్ట్‌గా రూ.60 లక్షల విలువైన కారు..
ఆర్‌ఆర్‌బీ, టెట్.. రెండు ఒకే రోజున నిర్వహిస్తుండటంవల్ల ఒకదానికి మాత్రమే హాజరయ్యేందుకు విద్యావంతులైన యువతకు అవకాశం ఉంటుంది.. కానీ, ఉద్యోగం ఆశించే నిరుద్యోగులు… ఇందులో రెండింటికి హాజరు అవుతున్నారని పేర్కొన్నారు బండి సంజయ్. ఆర్‌ఆర్‌బీ అనేది జాతీయ స్థాయి పరీక్ష.. ఇది వాయిదా వేయడం కుదరదు కావున.. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే టెట్‌ను మరొక తేదీన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఆశలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే టెట్‌ను వాయిదా వేయాలని బీజేపీ తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు బండి సంజయ్.