TRS MLA Balka Suman Fired on Union Minister Piyush Goyal and TS BJP Leaders.
బుద్ధి అవగాహన లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామని టీఆర్ఎస్‌ఎల్పీ, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తన బాధ్యతలను విస్మరించి దుర్మార్గంగా రైతుల పొట్ట కొడుతున్నారన్నారు. తెలంగాణ రైతులను, ప్రజలను అవహేళన చేస్తూ కించపరుస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాటలను ఖండించాల్సిన నాయకులు వత్తాసు పలుకుతున్నారని ఆయన మండిపడ్డారు.
వన్ నేషన్ వన్ ప్రోక్యూర్ మెంట్ పాలసీ ఎందుకు ఉండొద్దు అని ఆయన ప్రశ్నించారు. వరి పండించండి అని, బండి సంజయ్ రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్నారు.
కేంద్రం తో ధాన్యం కొనుగోలు చేయించే బాధ్యత నాది అని సంజయ్ అన్నారని, ఇప్పుడు ఇది తెలంగాణ బీజేపీ నాయకుల నిజ స్వరూపమని ఆయన వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వం కనీస బాధ్యత.. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రైతులను ప్రజలను ఇబ్బందులు పెట్టడం ద్వారా రాక్షస ఆనందం పొందుతున్నారన్నారు. ఇప్పటికీ అయిన తెలంగాణ బీజేపీకి ప్రజల మీద ప్రేమ ఉంటే మీ అధిష్టానం పై ఒత్తిడి తీసుకురండని ఆయన సవాల్ చేశారు. పంజాబ్ తరహాలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, లేదంటే బీజేపీ భరతం పడుతామని ఆయన హెచ్చరించారు. బీజేపీ చిల్లర మాటలు మానుకోవాలని, రైతులతో పెట్టుకున్నోడు ఎవరు బాగుపడలేదు.. అప్పుడు చంద్రబాబు రైతులతో పెట్టుకొని బాగుపడలేదు..పీయూష్ గోయల్ కళ్ళు నెత్తికి ఎక్కాయని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.
