భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గిరిజన మహిళలపై విచక్షణ రహితంగా ఓ అటవీ శాఖ అధికారి వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. జిల్లాలోని ములకలపల్లి మండలం సాకివలస గ్రామంలో ఆదివాసీ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఫారెస్ట్ బీట్ గార్డు మహేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు పోటు రంగారావు డిమాండ్ చేశారు.
కట్టెలు కొట్టేందుకు అడవికి వెళ్లిన ముగ్గురు ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ గార్డు దాడికి పాల్పడ్డాడని శుక్రవారం రంగారావు ఆరోపించారు. దాడి సమయంలో ఒక మహిళ కాలువలో పడిపోయిందని, అంతటితో ఆగకుండా ఫారెస్ట్ గార్డు మహిళ బట్టలను లాగేసి వివస్త్రను చేశాడని రంగారావు ఆరోపిస్తూ, ఆదివాసీలపై అటవీ సిబ్బంది దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని అన్నారు. మహేష్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గాయపడిన మహిళకు అటవీ శాఖ వైద్యం అందించాలని ఆయన అన్నారు.