Komaram Bheem District : ఆసిఫాబాద్‌లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..

  • ఉప్పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు
  • వరదలో కొట్టుకుపోయిన బైకిస్టులు
  • సమయస్ఫూర్తితో కాపాడిన గ్రామస్థులు
  • లో-లెవల్ వంతెనపై సాహసం వద్దు
Asifabad Floods

Asifabad Floods

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర వరద పరిస్థితులు నెలకొన్నాయి. వర్షపు నీటితో జిల్లాలోని చెరువులు, కాలువలు పూర్తిస్థాయిలో నిండడమే కాకుండా, వాగులు , వంకలు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో చింతల మానేపల్లి మండలంలోని దిందా, కేతుని గ్రామాల మధ్య ఉన్న లో-లెవల్ వంతెన పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాణాలకు తెగించి దాటవద్దని అధికారులు ఎంత హెచ్చరిస్తున్నప్పటికీ, పరిస్థితుల తీవ్రతను గమనించకుండా రోడ్లు దాటే ప్రయత్నాలు చేయడం వల్ల తీవ్రమైన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

 

ఇటీవల కేతుని గ్రామం వైపు నుండి దిందా వైపునకు బైక్‌పై బయలుదేరిన ఇద్దరు వ్యక్తులు, మార్గమధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న లో-లెవల్ వంతెనను దాటేందుకు సాహసించారు. ప్రవాహ వేగం తీవ్రంగా ఉండటంతో అదుపుతప్పిన బైక్ తో పాటు ఆ ఇద్దరు వ్యక్తులు క్షణాల్లో వరద నీటిలో చిక్కుకుపోయి కొట్టుకుపోవడం ప్రారంభించారు. ఈ ఘోర ప్రమాదాన్ని గమనించిన స్థానిక గ్రామస్థులు వెంటనే అప్రమత్తమై, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధైర్యంగా స్పందించారు. వేగంగా ప్రవహిస్తున్న నీటిలోకి దిగి, సమయస్ఫూర్తితో ఆ ఇద్దరినీ సురక్షితంగా బయటకు లాగి ప్రాణాపాయం నుంచి కాపాడారు. సమయానికి స్థానికులు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, వరదలు తగ్గే వరకు ఇటువంటి ప్రవాహాలు దాటేందుకు ఎవరూ సాహసించవద్దని స్థానికులు కోరుతున్నారు.