Agnipath Scheme Protest LIVE Updates:
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పరిస్థితి చేయి దాటింది. ‘అగ్నిపథ్’ రద్దు చేసి, పాత పద్ధతిలో సైనికుల నియామకాలు జరపాలని డిమాండ్ చేస్తున్న వేలాది మంది యువకులు పలు రైళ్లకు నిప్పుపెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లోనూ తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీనిపై బీజేపీ మహిళా నేత విజయశాంతి స్పందించారు. సికింద్రాబాద్ లోనూ, దేశవ్యాప్తంగానూ జరిగిన రైళ్ల విధ్వంసం ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నట్టుగా ఇది ఆర్మీ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకులు, విద్యార్థుల పనికాదని స్పష్టం చేశారు. అగ్నిపథ్ వ్యతిరేక నిరసనల వెనుక కచ్చితంగా ప్రేరేపిత కుట్ర ఉందని ఆరోపించారు. మోదీ సర్కారును, బీజేపీని వ్యతిరేకిస్తున్న అసాంఘిక శక్తులు, రౌడీ మూకల్ని రెచ్చగొట్టి చేయిస్తున్న హింసాకాండ అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ఏళ్ల తరబడి తీవ్రస్థాయిలో కొనసాగిన రోజుల్లో కూడా రాష్ట్ర విద్యార్థులు, యువతీయువకులు ఎంతో సంయమనంతో వ్యవహరించారని, రైల్ రోకోలు, వంటావార్పులు, బంద్ లు, శాంతియుత నిరసనలు చేపట్టారని వివరించారు. ఈ తరహాలో హింస, ఆస్తుల విధ్వంసం జరగలేదన్నారు.
అగ్నిపథ్ విధ్వంసం నుంచి బయటపడుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మరికొన్ని రైళ్ళు రద్దు. ఐదు ట్రైన్ల పునురుద్ధరణ జరిగింది.
హైదరాబాద్- విశాఖపట్నం
హైదరాబాద్- చెన్నై సెంట్రల్
హైదరాబాద్-తాంబరం
విశాఖపట్నం- హైదరాబాద్
తాంబరం- హైదరాబాద్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి యథావిధిగా ప్రారంభమయ్యాయి రైళ్ళు. సికింద్రాబాద్ కి బదులుగా మౌలాలి, కాచిగూడ నుంచి ప్రారంభం అయ్యాయి మరికొన్ని రైళ్ళు. లింగంపల్లి-కాకినాడ ట్రైన్ ప్రారంభం. తిరిగి రైళ్ళు పునరుద్ధరణ కావడంతో ప్రయాణికుల ఆనందం. ప్లాట్ ఫాం1 పై వున్న లింగంపల్లి-కాకినాడ రైలు.
కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రైళ్ల పునరుద్ధరణ కొనసాగుతోంది. కాచిగూడ నుంచి బయలుదేరాల్సిన చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్, మైసూర్ ఎక్స్‌ప్రెస్, ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్, తిరుపతి, విశాఖ వెళ్లాల్సిన రైళ్లు బయలుదేరాయని వెల్లడించారు. సికింద్రాబాద్ మీదుగా వెళ్లాల్సిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించినట్లు చెప్పారు. తిరుపతి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కూడా బయలుదేరనుంది
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటన పై కేసు నమోదు చేశారు రైల్వే పోలీసులు. సెక్షన్ 143, 147, 324, 307, 435,427, 448, 336, 332, 341,రెడ్ విత్ 149 తో పాటు ఇండియన్ రైల్వే యాక్ట్ 150, 151, 152, కింద కేసులు నమోదయ్యాయని రైల్వే ఎస్పీ అనూరాధ తెలిపారు.
రైల్వే ఉద్యోగి రాజా నర్సు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశామన్నారు. ఇంకా కేసు దర్యాప్తు చేయాల్సి ఉందని, ఇంత మంది దాడిలో పాల్గొన్నారో ఇంకా గుర్తించలేదు. ఆస్తి నష్టం ఇంకా అంచనా వేయలేదన్నారు అనూరాధ. పలువురు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నాం. రైళ్లు రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు. మళ్ళీ ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు ఎస్పీ అనూరాధ.
కాసేపట్లో సికింద్రాబాద్ నుంచి రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రాత్రి 7.40కి లింగంపల్లి-కాకినాడ ట్రైన్ బయల్దేరనుంది. అలాగే రాత్రి 8.20 గంటలకు విశాఖ-గరీబ్ రథ్ రైలు బయలుదేరనుంది.
కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ పథకంతో తాము నష్టపోతామని ఆర్మీ ఆశావహులు దేశవ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా రైల్వే ఆస్తులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. యువత హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొనరాదని, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. బీహార్, తెలంగాణలో రైళ్లను ధ్వంసం చేసిన ఘటనలు నమోదయ్యాయి. బీహార్ లో ఆందోళనకారులు ఇస్లామ్ పూర్, దానాపూర్ రైల్వేస్టేషన్లలో రైళ్లను దగ్ధం చేశారు. సికింద్రాబాద్ లోనూ రైల్వే ఆస్తులు ధ్వంసం చేశారని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా తెలిపారు. నాలుగైదు రైళ్ల ఇంజిన్లను, రెండు మూడు బోగీలను అగ్నికి ఆహుతి చేశారు.
సికింద్రాబాద్‌లో నెలకొన్న పరిస్థితులకు కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. అయితే రాత్రి నుంచి యథాతథంగా రైళ్లు నడుస్తాయని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు తప టికెట్లను క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరంలేదని, కాకపోతే రైళ్ల రాకపోకల్లో కొంత ఆలస్యం ఉంటుందని పేర్కొన్నారు.
రేపు భారత్ బంద్. బీహార్లో ఆందోళన చేస్తున్న యువకులు జూన్ 18వ తేదీన భారత్ బంద్‌కు పిలుపు నిచ్చారు.RJD ఆధ్వర్యంలోని ప్రతిపక్ష పార్టీలు ఈ బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాల్పుల్లో మరణించిన రాకేష్ డెడ్ బాడీకి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. రాకేష్ డెడ్ బాడీని అతడి బంధువులకు పోలీసులు అప్పగించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య రాకేష్ డెడ్ బాడీ తరలిస్తున్నారు.