NTV Telugu Site icon

వర్కింగ్‌ ప్రెసిడెంట్లకు రేవంత్‌రెడ్డి కీలక బాధ్యతలు..

Revanth Reddy

Revanth Reddy

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికార లక్ష్యంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్‌ పార్టీ… ఈ మధ్యే ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పీసీసీ చీఫ్‌ పదవితో పాటు.. వివిధ కమిటీలను ప్రకటించింది కాంగ్రెస్‌ అధిష్టానం.. ఇక, కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్‌ వచ్చిందనే టాక్‌ నడుస్తోంది.. మరోవైపు.. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లకు కొత్త బాధ్యతలు అప్పగించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… వారికి పార్లమెంట్‌ స్థానాల వారీగా పని విభజన చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ఉన్న గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, అజహరుద్దీన్‌, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు బాధ్యతలు అప్పగించారు రేవంత్‌రెడ్డి… గీతారెడ్డికి సికింద్రాబాద్‌, నల్గొండ, హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలతో పాటు పార్టీ అనుబంధ విభాగాలైన ఎన్‌ఎస్‌యూఐ, మేధావుల విభాగం, రీసెర్చ్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ బాధ్యతలను అప్పగించారు పీసీసీ చీఫ్.. ఇక, అంజన్‌కుమార్‌ యాదవ్‌కు నిజామాబాద్‌, మహబూబాబాద్‌, మెదక్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గాలు.. యువజన కాంగ్రెస్‌, మైనారిటీ, మత్స్యకార విభాగాలను అప్పజెప్పారు. మరోవైపు.. అజహరుద్దీన్‌కు ఆదిలాబాద్‌, జహీరాబాద్‌, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు సోషల్‌ మీడియా బాధ్యతలు కట్టబెట్టారు రేవంత్‌రెడ్డి.. ఇక.. జగ్గారెడ్డికి ఖమ్మం, వరంగల్‌, భువనగిరి, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలతో పాటు మహిళా కాంగ్రెస్‌, ఐఎన్‌టీయూసీ, కార్మిక విభాగం బాధ్యతలు ఇచ్చారు.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, సేవాదళ్‌ విభాగాలను అప్పజెప్పిన రేవంత్‌రెడ్డి.. పని విభజన చేసి.. మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.