Site icon NTV Telugu

Troubles to TRS: అధికార పార్టీకి తలనొప్పులు..! ఇబ్బందిగా ఆ మూడు ఘటనలు..!

Trs

Trs

టీఆర్ఎస్‌ పార్టీ నేతల వ్యవహారాలు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయి. ఒకటి తర్వాత.. వరుసగా జరుగుతున్న ఘటనల్లో గులాబీ నేతలకు సంబంధాలు ఉండటం ఆ పార్టీకి తలనొప్పిగా పరిణమించింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో జరిగిన మూడు వ్యవహారాలు టీఆర్ఎస్‌ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. వీటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక… టీఆర్‌ఎస్‌ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. రామాయంపేటకు చెందిన తల్లికొడుకులు ఆత్మహత్య చేసుకోవడం… సెల్ఫీ వీడియో మున్సిపల్‌ ఛైర్మన్‌ జితేందర్‌ పేరు చెప్పడం… రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగుతోంది. రియల్ ఎస్టేట్‌ వ్యాపారంలో 50 శాతం వాటా ఇవ్వాలని వేధింపులకు గురి చేయడంతోనే.. ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సంతోష్‌ వీడియోలో చెప్పాడు. ఇప్పటికే రామాయంపేట మున్సిపల్‌ ఛైర్మన్‌పై కేసు నమోదైంది.

Read Also: Sri Lanka Economic crisis: తారాస్థాయికి నిత్యావసరాల ధరలు.. కిలో బియ్యం రూ.440..

మరోవైపు ఖమ్మం జిల్లాకు చెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌ ఆత్మహత్య… రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్‌ హీట్‌ పెంచుతోంది. మంత్రి వేధించి.. అక్రమ కేసులు పెట్టడమే కాకుండా రౌడీ షీట్‌ ఓపెన్‌ చేయడంతోనే… ఆత్మహత్యకు ప్రయత్నించానని సాయి గణేష్ చనిపోయే ముందు చెప్పాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కమలం పార్టీ… అధికార టీఆర్‌ఎస్‌పై విమర్శలు ఎక్కుపెట్టింది. పోరాటానికి సిద్ధమైంది. రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని… ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నాయంటూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నాయి.

ఇక సూర్యాపేట జిల్లా కోదాడలో యువతిపై అత్యాచారం… టీఆర్ఎస్‌ పార్టీ మెడకు చుట్టుకుంది. ఇద్దరు యువకులు ఓ యువతిని మూడురోజుల పాటు బంధించి చిత్రహింసలకు గురి చేశారు. కూల్ డ్రింక్‌లో మత్తు మంది కలిపి… అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారు. అధికార పార్టీకి చెందిన 26 వార్డు కౌన్సిలర్‌ ఫాతిమా కుమారుడితో పాటు సాయిరామ్‌ రెడ్డి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు… తమను బెదిరిస్తున్నారని… బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా.. మూడు ఆత్మహత్యలు, ఒక అత్యాచారం… టీఆర్ఎస్‌ పార్టీ నేతలకు… కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. మూడింట్లోనూ ప్రత్యక్షంగా గులాబీ పార్టీ నేతలకు సంబంధం ఉండటంతో… ఎలా బయటపడాలో అర్థం కాక అధిష్ఠానం ఆపసోపాలు పడుతోంది.

Exit mobile version